సాగర్ సొరంగం పనులు ఆపేయిస్తం..రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సాగర్ సొరంగం పనులు ఆపేయిస్తం..రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • కృష్ణా, గోదావరిలో దక్కాల్సిన వాటాను సాధిస్తం 
  • నెహ్రూను ప్రశ్నించే అర్హత కేటీఆర్‌‌‌‌కు లేదు
  • 36% నీళ్లు చాలని కేసీఆర్ సంతకం పెట్టారు
  • 70% వాటా కోసం మా న్యాయపోరాటం
  • నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  •  కేఆర్ఎంబీ, కేంద్రానికి ఇప్పటికే ఫిర్యాదు 

హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి సుమారు 1.8 టీఎంసీలను తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న తాగునీటి పథకం, సొరంగ నిర్మాణాన్ని అడ్డుకొని తీరుతామని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ చేస్తున్న ఈ పనులపై ఇప్పటికే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశామని, ఏపీ ప్రభుత్వానికీ తమ తీవ్ర అభ్యంతరం తెలిపామన్నారు.  బుధవారం మంత్రి ఉత్తమ్​ సెక్రటేరియెట్​లో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర నీటి ప్రయోజనాలను దెబ్బతీసే,  నిబంధనలను ఉల్లంఘించే ఏ ప్రాజెక్టునైనా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని, తెలంగాణ నీటి భద్రతకు ముప్పు వాటిల్లకుండా కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్రానికి దక్కాల్సిన ప్రతి బొట్టునూ కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

తెలంగాణ సాగునీటి చరిత్రలో బీఆర్ఎస్​ పాలన ఒక చీకటి అధ్యాయం..

దేశ సాగునీటి మౌలిక సదుపాయాల కల్పనలో మాజీ ప్రధాని నెహ్రూ పాత్రను ప్రశ్నించే అర్హత కేటీఆర్‌‌కు లేదని మంత్రి ఉత్తమ్​ మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో సుమారు రూ.1.83 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారే తప్ప, ఆ ఖర్చుకు తగిన ఫలితాలను రైతులకు గానీ, రాష్ట్రానికి గానీ అందించలేదని ఉత్తమ్ ఆరోపించారు. గత ప్రభుత్వ విధానాలు తెలంగాణ సాగునీటి చరిత్రలో ఒక చీకటి అధ్యాయాన్ని మిగిల్చాయని విమర్శించారు. ఆర్థిక అవకతవకలు, ప్రాజెక్టుల అంచనా వ్యయాల పెంపు, నెరవేరని హామీలే బీఆర్ఎస్ పాలనకు నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌‌సాగర్, ఆర్డీఎస్ ఆధునీకరణ, ఎస్ఎల్బీసీ, డిండి వంటి ప్రాజెక్టులకు తగిన ప్రాధాన్యం ఇచ్చి ఉంటే రాష్ట్రంలో సాగునీటి విస్తీర్ణం భారీగా పెరిగి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు

36 % చాలని కేసీఆర్ సంతకం.. 

కృష్ణా జలాల పంపిణీ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మొత్తం 811 టీఎంసీల కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు (సుమారు 36 శాతం వాటా) చాలంటూ నాడు కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించి సంతకాలు పెట్టిందని విమర్శించారు.  తాము అధికారంలోకి వచ్చాక కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణకు 555 టీఎంసీల (సుమారు 70 శాతం) వాటా దక్కాలని బలంగా వాదనలు వినిపిస్తూ న్యాయపోరాటం చేస్తున్నట్టు చెప్పారు.  బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ 4,464 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకుంటే, అదే సమయంలో తెలంగాణకు దక్కింది కేవలం 1,993 టీఎంసీలు మాత్రమేనని వెల్లడించారు. ప్రస్తుతం కృష్ణా జలాలను రికార్డు స్థాయిలో అత్యధికంగా వినియోగించుకుంటున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. 

కృష్ణా బోర్డు చైర్మన్​కు ఉత్తమ్ ఫోన్ 

ఏపీ అక్రమంగా చేపడుతున్న ప్రాజెక్టును ఆపాలంటూ మంత్రి ఉత్తమ్.. కృష్ణా బోర్డు చైర్మన్ ను కోరారు. బుధవారం బోర్డు చైర్మన్ శుభ్రాంశు బిశ్వాస్ కు ఫోన్ చేశారు. ప్రాజెక్టు వివరాలను ఆయనకు వివరించారు. డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తీసుకుపోవడమంటే తెలంగాణ ప్రయోజనాలకు గండీ కొట్టడమేనన్నారు. ఏపీ వెంటనే ఆ పనులు ఆపేలా ఆదేశాలివ్వాలన్నారు. మంత్రి విజ్ఞప్తికి బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయం తమ దృష్టిలో కూడా లేదని చెప్పారు.

క్రాప్​ హాలిడే ప్రకటించలేదు

ప్రభుత్వం యాసంగిలో క్రాప్​ హాలిడే ప్రకటించలేదని మంత్రి ఉత్తమ్​ స్పష్టం చేశారు. ఎల్​నినో నేపథ్యంలో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని, ఇందులో భాగంగానే వరికి బదులు  ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించామని చెప్పారు.  కేసీఆర్​లా కుట్రలు తమకు చేతకాదని, ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు జగన్మోహన్ రెడ్డి అండతో సాగర్​ ప్రాజెక్టుపై ఏపీ పోలీసులను దింపి తెలంగాణ సెంటిమెంట్​ను రెచ్చగొట్టింది నిజం కాదా అని ఉత్తమ్​ ప్రశ్నించారు.