జనసేన పార్టీ ఆఫీసులో ఉద్యోగాల పేరుతో భారీ మోసం జరిగిందంటూ ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. జనసేన కీలక నేతలు ఈ మోసానికి పాల్పడ్డారంటూ సదరు వార్తల సారాంశం. ఈ అంశంపై అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో సోషల్ మీడియాలో కూడా పెద్దఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలో జనసేన నాయకురాలు రుక్మిణీ కోట ఈ వివాదంపై స్పందించారు. తన ప్రతిష్ఠ దెబ్బ తీసేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారంటూ బహిరంగ లేఖ విడుదల చేశారు రుక్మిణీ కోట.
చాలా సంవత్సరాలుగా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి, వ్యక్తిగత జీవితం గురించి కల్పిత కథనాలను ప్రచారం చేయడానికి, తన వృత్తిపరమైన ప్రతిష్ఠను దిగజార్చడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు రుక్మిణీ. నేను విశ్వసించే విలువలను, నేను పనిచేస్తున్న పదవికి సంబంధించిన వృత్తిపరమైన నియమ నిబంధనలను గౌరవిస్తూ ఇన్నాళ్లూ మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నానని... అయితే, నా వ్యక్తిత్వాన్ని కించపరచడం, నా కుటుంబాన్ని వివాదాల్లోకి లాగడం, నాపై నిరాధార ఆరోపణలు చేయడం వంటి ప్రయత్నాలు పదేపదే జరుగుతుండటంతో హద్దులు దాటిపోయాయని అన్నారు.
ఇటీవల, తన సంస్థలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి తన పేరును, కంపెనీ గుర్తింపును, అధికారిక పత్రాలను దుర్వినియోగం చేస్తూ ఆర్థిక ప్రయోజనాల కోసం మోసానికి పాల్పడినట్లు తన దృష్టికి వచ్చిందని... ఈ కార్యకలాపాలన్నీ అధికారిక పని వేళలకు వెలుపల, తన ప్రమేయం, అనుమతి, సమ్మతి లేకుండానే జరిగినట్లు తెలిసిందని అన్నారు.
ఈ విషయం తెలియగానే వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేసి, వివరణ కోరానని వెల్లడించారు రుక్మిణీ. అంతర్గత విచారణ అనంతరం ఆ ఉద్యోగిని విధుల నుంచి తొలగించానని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశానని.. చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించానని లేఖలో పేర్కొన్నారు రుక్మిణీ.
అయితే, అసలు నేరానికి పాల్పడిన వారిని ప్రశ్నించాల్సింది పోయి, కొంతమంది రాజకీయ నాయకులు, మీడియా ప్లాట్ ఫామ్స్ ఈ మోసానికి సంబంధించి ఫిర్యాదు చేసిన నన్నే నిందితురాలిగా చిత్రీకరిస్తున్నాయని... వాస్తవాలను వక్రీకరించి, నా వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి జరుగుతున్న ఈ ఉద్దేశపూర్వక ప్రయత్నం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోందని అన్నారు రుక్మిణీ.
