హైదరాబాద్లో భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణే లక్ష్యంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘ఇంటికో ఇంకుడు గుంత’ నినాదంతో ఆలివ్ మిఠాయి ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల నిర్మాణ పోటీని నిర్వహిస్తున్నారు. ఇంకుడు గుంతలు నిర్మించి, వాటి నిర్మాణానికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వారికి భారీ నగదు బహుమతులు అందించనున్నారు.
ఈ పోటీలో అత్యధిక వ్యూస్ సాధించిన మూడు వీడియోలకు మొత్తం రూ.10 లక్షల బహుమతులు ప్రకటించారు.ఈ పోటీకి సంబంధించిన పోస్టర్ను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆవిష్కరించారు. వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఇంకుడు గుంతలతో నీటి సమస్యలకు పరిష్కారం
ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. ఇంకుడు గుంతల నిర్మాణం వల్ల వర్షాకాలంలో వరద ముప్పును తగ్గించుకోవచ్చని తెలిపారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని, వేసవిలో నీటి ఎద్దడి సమస్యను నివారించేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గినప్పటికీ భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటే నీటి కష్టాలను చాలా వరకు తగ్గించుకోవచ్చని రంగనాథ్ వివరించారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు.
ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేయాలి
ఈ పోటీలో పాల్గొనాలనుకునేవారు తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతను నిర్మించి, ఆ ప్రక్రియకు సంబంధించిన వీడియోను చిత్రీకరించాలి. ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో పాటు @oliveforsociety పేజీని COLLAB POSTలో భాగస్వామిగా చేర్చాలని నిర్వాహకులు సూచించారు.అత్యధిక వ్యూస్ సాధించిన మూడు వీడియోలకు నగదు బహుమతులు అందజేయనున్నారు.
బహుమతుల వివరాలు
- మొదటి బహుమతి: రూ.5 లక్షలు
- రెండో బహుమతి: రూ.3 లక్షలు
- మూడో బహుమతి: రూ.2 లక్షలు
మొత్తం రూ.10 లక్షల నగదు బహుమతులను విజేతలకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చేతుల మీదుగా అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో Save Water! Save Earth!తో పాటు Tree Guard సంస్థలు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. నగరంలోని చెరువుల పునరుద్ధరణకు కృషి చేస్తున్న హైడ్రా కార్యక్రమాలను ఆలివ్ మిఠాయి అభినందించింది.ఇంటికో ఇంకుడు గుంత నిర్మాణం ద్వారా వర్షపు నీటిని సంరక్షిస్తూ భూగర్భ జలాలను పెంచాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ పోటీ ప్రధాన లక్ష్యం.
