కరీంనగర్: భారీ మొత్తంలో రుణం మంజూరు చేయిస్తానంటూ ఆన్లైన్లో ప్రచారం చేసి అమాయకులను మోసం చేసిన వ్యక్తిని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.1.50 కోట్ల లోన్ ఇప్పిస్తానని నమ్మించి బాధితుల నుంచి ఏకంగా రూ.12.21 లక్షలు వసూలు చేసిన వేల్పుల సాయికృష్ణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు సాయికృష్ణ రూ.1.50 కోట్ల వరకు రుణం మంజూరు చేయిస్తానంటూ ఆన్లైన్లో ప్రచారం నిర్వహించాడు. ఈ ప్రకటనలను నమ్మిన బాధితులను సంప్రదించి, లోన్ మంజూరు చేయించేందుకు ఇన్సూరెన్స్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో విడతలవారీగా డబ్బులు వసూలు చేశాడు.అంతటితో ఆగకుండా టాటా క్యాపిటల్ ఫైనాన్స్ సంస్థ పేరుతో రుణం మంజూరైనట్లు నకిలీ పత్రాలను సృష్టించి బాధితులను నమ్మించాడు. అయితే లోన్‌కు సంబంధించిన పత్రాలు నకిలీవని గుర్తించిన బాధితులు కరీంనగర్ రూరల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు వేల్పుల సాయికృష్ణను అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి నకిలీ లోన్ మంజూరు పత్రాలు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
