ప్రిన్స్ విలియమ్‌కు కరణ్ జోహార్ బాలీవుడ్ ట్రీట్.. 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి'గురించి ఆసక్తికర చర్చ!

ప్రిన్స్ విలియమ్‌కు కరణ్ జోహార్ బాలీవుడ్ ట్రీట్.. 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి'గురించి ఆసక్తికర చర్చ!

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్ కు ముంబయిలో బాలీవుడ్ స్టైల్‌లో గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా బుధవారం ( నవంబర్ 18, 2026 ) ఆయన ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ కార్యాలయాన్ని సందర్శించారు.  భారతీయ సినిమా పాటలు, సంప్రదాయ నృత్యాలు, నోరూరించే వంటకాలతో యువరాజుకు అదిరిపోయే ఆతిథ్యం లభించింది. ఈ రాయల్ మీట్‌లో బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కూడా సందడి చేశారు.

ఈ సమావేశంలో కరణ్ జోహార్ భారతీయ సినిమా ప్రపంచం గురించి ప్రిన్స్ విలియమ్‌కు ఆసక్తికరమైన విషయాలు వివరించారు. భారతదేశంలో హిందీ మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ, గుజరాతీ తదితర భాషల్లో అద్భుతమైన సినిమాలు రూపొందుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి' చిత్రాలు భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాయని వివరించారు. పశ్చిమాసియా దేశాల్లో భారతీయ చిత్రాలకు భారీ మార్కెట్ ఉందని, విదేశాల్లోనూ ప్రముఖ సినిమా థియేటర్ చైన్లు ఇండియన్ చిత్రాలను ప్రదర్శిస్తున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా తన కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న 'కభీ ఖుషీ కభీ గమ్' సినిమా గురించి కూడా కరణ్ ప్రస్తావించారు. ఈ చిత్రం చిత్రీకరణలో ఎక్కువ భాగం బ్రిటన్‌లోనే జరిగిందని చెబుతూ.. తప్పకుండా చూడాలని ప్రిన్స్‌ను కోరారు. సినిమా 3 గంటల 32 నిమిషాల నిడివి ఉన్నప్పటికీ చూస్తానని యువరాజు మాటిచ్చినట్లు కరణ్ వెల్లడించారు. ఈ చిత్రం 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో దాని జ్ఞాపకాలు తనకు ఎంతో భావోద్వేగాన్ని కలిగించాయని చెప్పారు.

ఇక సమావేశంలో 'సే శావా శావా', 'బోలే చూడియా' పాటలకు సంప్రదాయ దుస్తుల్లో కళాకారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముంబయి ప్రత్యేక వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. క్రికెట్‌పైనా చర్చ సాగింది. సైఫ్, కరీనా తమ లండన్ అనుబంధాన్ని యువరాజుతో పంచుకున్నారు. మొత్తానికి ఈ రాయల్ విజిట్‌తో ధర్మ ప్రొడక్షన్స్ కార్యాలయం కాసేపు బాలీవుడ్ వేడుకను తలపించింది. భారతీయ సినిమా వైభవాన్ని ప్రపంచ వేదికపై చాటిచెప్పిన ఈ భేటీ ఇప్పుడు సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది..