సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ చిత్రం 'వారణాసి'. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే చిత్రం రిలీజ్ విషయంలో ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఐపీఎల్ క్రికెట్ టోర్నీ ఈ సినిమా విడుదల ప్లాన్ ను మార్చేస్తోందని టాక్ జోరుగా వినిపిస్తోంది.
ఒకప్పుడు సినిమా విడుదలకు వేసవి సెలవులే సరైన సీజన్‌గా భావించేవారు. కానీ ఇప్పుడు ఐపీఎల్ ప్రభావంతో సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. 2027 మార్చి చివరి నుంచి మే వరకు క్రికెట్ సందడి కొనసాగుతుండటంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెద్ద సినిమాల కలెక్షన్లపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉండటంతో నిర్మాతలు విడుదల తేదీల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాజమౌళి కూడా గత అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా 'ఆర్ఆర్ఆర్' సినిమా ఐపీఎల్ సీజన్ సమయంలో ఎదుర్కొన్న బాక్సాఫీస్ ప్రభావం ఆయనను మరోసారి ఆలోచించేలా చేసిందని ప్రచారం జరుగుతోంది. 'బాహుబలి 2' వసూళ్లను అందుకోవడంలో వెనుకబడటానికి ఐపీఎల్ కూడా ఒక కారణమని అప్పట్లో ట్రేడ్ వర్గాల్లో చర్చ సాగింది. దీంతో ఈసారి అలాంటి రిస్క్ తీసుకోవడానికి రాజమౌళి సిద్ధంగా లేరని అంటున్నారు.
మరోవైపు 'వారణాసి' షూటింగ్ పూర్తయినట్లు నవంబర్ 15న చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం భారీ స్థాయిలో సీజీ, విజువల్ ఎఫెక్ట్స్, రీ-రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. అయితే డబ్బింగ్ కార్యక్రమాలు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. మహేశ్ బాబు ఇందులో రుద్ర పాత్రలో కనిపించనుండగా, ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ కుంభగా అలరించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో, విభిన్న కాలమానాల్లో సాగే ఈ అడ్వెంచర్ కథలో రామాయణానికి సంబంధించిన ప్రత్యేక ఘట్టం కూడా ఉండనుందని ఇప్పటికే ప్రచారం జరిగింది...
అయితే ఈ 'వారణాసి' మూవీని ఎట్టిపరిస్థితుల్లో ఏప్రిల్ 7, 2027న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఐపీఎల్ ప్రభావంతో ఈ మూవీ జూలై 31, 2027కు వాయిదా పడవచ్చనే ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి ఐపీఎల్‌ను తప్పించుకుని రాజమౌళి కొత్త రిలీజ్ డేట్‌తో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తారా? లేక ఏప్రిల్ 7నే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు విజువల్ వండర్ చూపిస్తారా? ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే..
