Happy Journey : ఏడుగురు మహిళల ఫ్రాన్స్ ట్రిప్.. ఓటీటీలో దూసుకెళ్తున్న నవ్వులు, కన్నీళ్లతో సాగే 'హ్యాపీ జర్నీ'!

Happy Journey : ఏడుగురు మహిళల ఫ్రాన్స్ ట్రిప్.. ఓటీటీలో దూసుకెళ్తున్న నవ్వులు, కన్నీళ్లతో సాగే 'హ్యాపీ జర్నీ'!

ప్రతిరోజూ ఓటీటీలోకి ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. కానీ వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటూ ట్రెండింగ్ నిలుస్తాయి. అలాంటి ఓ ఆసక్తికరమైన సినిమానే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో సందడి చేస్తోంది. అదే 'హ్యాపీ జర్నీ'. ఈ సినిమాకు థియేటర్లలో విడుదలైన సమయంలో కంటే ఓటీటీలోకి వచ్చాక మరింత ఆదరణ లభిస్తోంది. దీంతో అసలు ఈ సినిమాలో ఏముంది? ఇంతలా ప్రేక్షకులను ఎందుకు ఆకట్టుకుంటోంది? అనే ఆసక్తి మొదలైంది.

'కొన్ని ప్రయాణాలు ప్రణాళికలను మారుస్తాయి.. మరికొన్ని జీవితాలనే మార్చేస్తాయి' అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ చిత్రం కథ కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. ఓ ట్రావెల్ కంపెనీ ఉచిత ఫ్రాన్స్ ట్రిప్ ఆఫర్ ప్రకటిస్తుంది. ఈ ఆఫర్‌తో విభిన్న నేపథ్యాలు, భిన్నమైన సమస్యలు, జీవిత కథలు కలిగిన ఏడుగురు మహిళలు ప్రయాణానికి సిద్ధమవుతారు. అయితే సరదాగా సాగుతుందనుకున్న ఈ ప్రయాణంలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అసలు ఆ ఏడుగురు మహిళల కథలేంటి? ఫ్రాన్స్ ప్రయాణం వారి జీవితాలను ఎలా మార్చింది? అన్నదే ఈ సినిమా ఆసక్తికరమైన కథాంశం.

కామెడీ, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా కలగలిపి తెరకెక్కించిన ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా, వంశీ, రవి శివతేజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మించగా, అభిరామ్ నాయుడు దర్శకత్వం వహించారు. శేఖర్ చంద్ర సంగీతం, మణికందన్ సుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా లేటెస్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చి డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా కుటుంబంతో కలిసి నవ్వుకుంటూ, భావోద్వేగాలకు లోనవుతూ చూడదగ్గ చిత్రంగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. మంచి ఫీల్‌గుడ్ సినిమా కోసం ఎదురుచూస్తున్నవారికి 'హ్యాపీ జర్నీ' ఓ మంచి ఛాయిస్‌గా నిలుస్తోంది..