టాలీవుడ్లో ఒకప్పుడు తన విలనిజంతో హీరోలకే గట్టి పోటీ ఇచ్చిన నటుడు గోపీచంద్.. ఇప్పుడు మరోసారి ప్రతినాయకుడి అవతారంలో కనిపించబోతున్నారు. అది కూడా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఎదురుగా నిలబడబోతున్నారు? ప్రస్తుతం ఈ క్రేజీ టాక్ సోషల్ మీడియాతో పాటు సినీ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఈ క్రేజీ కాంబినేషన్ కనుక నిజమైతే తెలుగు, తమిళ ప్రేక్షకులకు వెండితెరపై అదిరిపోయే యాక్షన్ ట్రీట్ దక్కడం ఖాయమనే చర్చ మొదలైంది.
సూర్య సినిమాలో గోపీచంద్..
లేటెస్ట్ సినీ ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. కోలీవుడ్ స్టార్ సూర్య తన నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం ఇంట్రెస్టింగ్ కథలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో దర్శకుడు DC డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్తో ఆయన ఓ భారీ యాక్షన్ చిత్రానికి సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు తమిళ సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టులో సూర్యకు ధీటుగా నిలిచే ప్రతినాయకుడి పాత్ర కోసం టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్. ఇదే నిజమైతే గోపీచంద్‌కు తమిళ చిత్ర పరిశ్రమలో ఇదొక స్పెషల్ ఎంట్రీ కానుంది.
ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్‌కు సుపరిచితమైన గోపీచంద్ నటన, కోలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం కానుంది. అయితే గోపీచంద్‌ను ఈ సినిమా కోసం సంప్రదించారా? ఒకవేళ అప్రోచ్ అయితే మ్యాచో స్టార్ ఒకే చేశారా? అనే విషయాలపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు, ఈ సినిమాను మాండాడి దర్శకుడు మతిమారన్ పుగళేంధి డైరెక్ట్ చేస్తున్నాడనే టాక్ కూడా ఉంది. అందువల్ల సూర్య 49 ఫిల్మ్‌ను DC డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్? లేక మండాడి ఫేమ్ మతిమారన్ అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది..
మళ్లీ విలన్‌గా గోపీచంద్?
గోపీచంద్ అంటే ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది యాక్షన్ హీరో ఇమేజ్. కానీ ఆయన కెరీర్ మొదట్లో చేసిన విలన్ క్యారెక్టర్స్‌కి స్పెషల్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా ‘జయం’లో రఘు, ‘నిజం’లో దేవుడు, ‘వర్షం’లో భద్రన్న పాత్రలతో ప్రేక్షకులను ఊర్రుతులూగించారు. ఈ మూడు సినిమాల్లోనూ గోపిచంద్ చూపించిన క్రూరత్వం, బాడీ లాంగ్వేజ్, నటన ఇప్పటికీ సినీ అభిమానులకు గుర్తుండిపోయాయి. ఆ తర్వాత 'యజ్ఞం' సినిమాతో హీరోగా మారి యాక్షన్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ విలన్ పాత్రలో కనిపిస్తారనే వార్త రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా సూర్య లాంటి స్టార్ హీరోను ఢీకొట్టే పాత్రలో గోపీచంద్ కనిపిస్తే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందోనని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.
అనిరుధ్, రియా షిబు పేర్లు కూడా!
ఈ సినిమాలో 'సర్వం మాయ' ఫేమ్ రియా షిబు కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ పేరు వినిపిస్తుండగా, సాయి అభ్యంకర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని ఝగరం స్టూడియోస్ నిర్మించనున్నట్లు టాక్. అయితే వీటిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
గోపీచంద్‌కు కోలీవుడ్‌లో బిగ్ బ్రేక్?
ప్రస్తుతం గోపీచంద్ 'భరతవర్ష: సాగా ఆఫ్ శూల' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో సూర్య సినిమాలో విలన్‌గా నటించే అవకాశం వస్తే ఆయనకు కోలీవుడ్‌లో మంచి గుర్తింపు లభించే ఛాన్స్ ఉంది. అయితే సూర్య–గోపీచంద్ కాంబినేషన్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రేజీ కాంబో నిజమవుతుందా? గోపీచంద్ మళ్లీ విలన్‌గా మెప్పిస్తారా? అనేది వేచి చూడాలి.
