భోపాల్: లాడ్జికి వెళ్లిన ఓ ప్రేమ జంటకు పోలీసుల నుంచి అనూహ్య పరిణామం ఎదురైంది. మేజర్లు అయిన ప్రేమ జంటను తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని పోలీసులు ఒత్తిడి చేశారు. అందుకు వారు నిరాకరించడంతో గంజాయి కేసు పెట్టి లోపలేస్తామంటూ పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
2026, నవంబర్ 13న సియోని జిల్లాలోని సిద్దార్థ్ హోటల్‌కు అదనపు ఎస్పీ దీపక్ మిశ్రా, ఎస్డీఓపీ చంచలేష్ మర్కం, టౌన్ ఇన్స్పెక్టర్ సతీష్ తివారీ తనిఖీలకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు ఓ ప్రేమ జంట కనిపించింది. పోలీసులు వారిని ఎవరు.. ఏంటి అని ప్రశ్నించగా.. తామిద్దరం మేజర్లమని, ఒకే సామాజిక వర్గానికి చెందినవారమని త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నామని వారు తెలిపారు.
అయితే, తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడాలని ఆ జంటను పోలీసులు ఒత్తిడి చేశారు. కానీ యువతి కుటుంబ సభ్యులకు కాల్ చేయడానికి నిరాకరించింది. దీంతో అదనపు ఎస్పీ దీపక్ మిశ్రా ఆగ్రహంతో యువతి వెంట ఉన్న అబ్బాయి బ్యాగులో కొంచెం గంజాయి పెట్టండని సిబ్బందికి సూచించాడు. ఏఎస్పీ బెదిరింపులకు పాల్పడిన దృశ్యాలు సీసీటీవీ వీడియోలో రికార్డయ్యాయి.
ALSO READ : దావూద్ ఇబ్రహీం ఇంటిని కూల్చివేస్తున్నారా..
పోలీసులు నెలకు రూ. 25 వేల లంచం డిమాండ్ చేశారని, తాను నిరాకరించడంతోనే హోటల్‌పై దాడి చేశారని హోటల్ యజమాని సంజు సనోడియా ఆరోపించారు. పోలీసుల తీరును బయటపెట్టడానికే తాను ఈ సీసీటీవీ వీడియోను విడుదల చేసినట్లు తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేజర్లయినా జంటను తల్లిదండ్రులకు ఫోన్ చేయమని ఒత్తిడి చేయడం.. నిరాకరించినందుకు గంజాయి కేసు బనాయించి లోపలేస్తామంటూ బెదిరించడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.
