గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజగోపాల్ రెడ్డి సంచలన విమర్శలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజగోపాల్ రెడ్డి సంచలన విమర్శలు

నల్గొండ జిల్లా: గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే  రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. గత ప్రభుత్వం ఆంధ్రా కాంట్రాక్టర్లను ప్రోత్సహించిందని, ప్రస్తుత ప్రభుత్వంలోనూ వారికే పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారని విమర్శించారు. అవినీతికి పాల్పడిన వారిపై ప్రస్తుత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం రూ.1,500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ నిధులు విడుదల కావడం లేదన్నారు. నిధులు అందక కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతున్నారని చెప్పారు. నిధుల మంజూరు కోసం డిప్యూటీ సీఎం చుట్టూ తిరిగి అలసిపోయానని వ్యాఖ్యానించారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యే మాదిరిగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,500 కోట్లతో పనులు చేపట్టాలని ప్రతిపాదించినప్పటికీ ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదని, మునుగోడు అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదల చేసి సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ALSO READ : సజ్జనార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు..రిటైర్డ్ ఐపీఎస్ నాగేశ్వరరావుకు X నోటీసులు.!

తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని, ఆత్మగౌరవం ఉన్న నాయకుడినని అన్నారు. ఎవరి ఇళ్ల చుట్టూ తిరిగే వ్యక్తిని కాదని, మునుగోడు అభివృద్ధే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. అధికార పక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.