మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టి లాంగ్‌టర్మ్‌లో మంచి సంపదను సృష్టించుకోవచ్చు. మొదటిసారి ఇన్వెస్ట్ చేసేవారు నెలకు రూ.5వేలతో ప్రారంభిస్తుంటారు. అయితే ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నామనే దానికంటే.. ఆ డబ్బులు మనకు ఎప్పుడు అవసరమవుతుందనే 'కాలపరిమితి'ని గుర్తించడం చాలా ముఖ్యం. మీ లక్ష్యాలను బట్టి సరైన ఫండ్లను ఎంచుకుంటే మంచి రిటర్న్స్ పొందేందుకు వీలుంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
పెట్టుబడి పెట్టే ముందు టార్గెట్ ఏంటి, ఆ డబ్బు ఏ అవసరం కోసం అనే క్లారిటీ తప్పక ఉండాలి ఇన్వెస్టర్లకు. షార్ట్ టర్మ్ గోల్స్ కోసం ఎక్కువ రిస్క్ తీసుకోవడం సరైన పద్ధతి కాదు. అదే సమయంలో 7 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పాటు పెట్టుబడి పెట్టాలని భావించే వారికి ఈక్విటీ ఫండ్స్ ఎంతో అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడి సమయాన్ని బట్టి ఫండ్లను ఎంచుకోవడం వల్ల అనవసరమైన మార్కెట్ నష్టాలను తగ్గించుకోవచ్చు.
ఈక్విటీ, డెట్, హైబ్రిడ్‌లో సరైన ఫండ్‌ను ఎంచుకోవడం:
* ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్: లాంగ్ టర్మ్ సంపద వృద్ధి కోసం ఇవి ఉపయోగపడతాయి. మొదటిసారి ఇన్వెస్ట్ చేసేవారు స్మాల్ క్యాప్, సెక్టోరల్ ఫండ్లలో మొత్తం డబ్బును పెట్టకుండా.. ఫ్లెక్సీ-క్యాప్, లార్జ్-క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ వంటి డైవర్సిఫైడ్ ఆప్షన్లను ఎంచుకోవడం సేఫ్.
* డెట్ మ్యూచువల్ ఫండ్స్: ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో డబ్బు అవసరమయ్యే స్వల్పకాలిక లక్ష్యాల కోసం ఇవి మేలు. ఇవి ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లలో పెట్టుబడి పెడతాయి.. కాబట్టి మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం తక్కువగా ఉంటుంది.
* హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్: 3 నుండి 5 సంవత్సరాల తర్వాత డబ్బు అవసరం ఉండి.. ఈక్విటీ రిస్క్ పూర్తిగా భరించలేక, అలాగని తక్కువ రిటర్న్స్ కాకుండా మధ్యస్థంగా కోరుకునే వారికి ఇవి సరిపోతాయి.
ALSO READ : జియో సిమ్ వాడుతున్నారా? రీఛార్జ్ అయిపోయిందా ?
మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు ఒక నిర్దిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) అంటారు. మార్కెట్ క్రాష్ అయినప్పుడు SIP ద్వారా ఎక్కువ యూనిట్లు, మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు మన పెట్టుబడులకు వస్తాయి. కొత్తవారు రూ.5వేలు పెట్టుబడిని 5, 6 వేర్వేరు ఫండ్స్‌లో విడగొట్టకుండా.. ఒక మంచి డైవర్సిఫైడ్ ఫండ్‌తో ప్రారంభించడం బెస్ట్. కాలక్రమేణా ఆదాయం పెరిగినప్పుడు SIP మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లవచ్చు.
