ఎస్‌ఆర్‌హెచ్‌ను వీడటం చాలా కష్టంగా ఉంది.. మనసులో మాట బయటపెట్టిన ట్రావిస్ హెడ్

ఎస్‌ఆర్‌హెచ్‌ను వీడటం చాలా కష్టంగా ఉంది.. మనసులో మాట బయటపెట్టిన ట్రావిస్ హెడ్

Travis Head SRH Exit: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2027) వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులను ఉద్దేశించి ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) భావోద్వేగపూరిత సందేశం విడుదల చేశాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా తాను ఐపీఎల్ 2027 సీజన్ నుంచి తప్పుకోవడం అత్యంత కష్టమైన నిర్ణయమని, అందువల్లే ఫ్రాంచైజీ తనను విడుదల చేయాల్సి వచ్చిందని హెడ్ స్పష్టం చేశాడు. రూ.14 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్ తరఫున ఆడిన హెడ్.. అభిషేక్ శర్మతో కలిసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీగా రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.

సన్‌రైజర్స్ అభిమానులకు ధన్యవాదాలు: ట్రావిస్ హెడ్

జట్టు నుంచి వైదొలిగిన సందర్భంగా ట్రావిస్ హెడ్ స్పందిస్తూ.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుతో గడిపిన అద్భుతమైన క్షణాలు, నా ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. జట్టు నుంచి తప్పుకోవడం నాకు చాలా కష్టమైన నిర్ణయం.. కానీ, నా అంతర్జాతీయ క్రికెట్ లక్ష్యాలు, నా కుటుంబానికి తగినంత సమయం కేటాయించాల్సిన (Work-life balance) అవసరం దృష్ట్యా నా కెరీర్‌లో ఈ దశలో ఇదే సరైన నిర్ణయమని భావిస్తున్నాను అని పేర్కొన్నాడు.

* SRH తరఫున విధ్వంసం: 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ ఫైనల్ చేరడంలో హెడ్ కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో 15 మ్యాచ్‌లలో 191.55 స్ట్రైక్ రేట్‌తో ట్రావిస్ హెడ్ 567 పరుగులు బాదాడు.

* 9 మంది విడుదల: హెడ్‌తో పాటు జయదేవ్ ఉనద్కత్, జెరాల్డ్ కొయెట్జీ సహా మొత్తం 9 మంది ఆటగాళ్లను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ వదులుకుంది.

మిచెల్ స్టార్క్‌ను విడుదల చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ (DC): 

మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసింది. రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసిన స్టార్క్.. క్రికెట్ ఆస్ట్రేలియా వర్క్‌లోడ్ పాలసీల వల్ల 2026 సీజన్ ఫస్ట్ హాఫ్ కి దూరమయ్యాడు. 2027 సీజన్‌కు కూడా అతడు అందుబాటులో ఉండటంపై క్లారిటీ లేకపోవడంతో ఢిల్లీ యాజమాన్యం స్టార్క్ కి గుడ్‌బై చెప్పేసింది. 

* ఢిల్లీ రిలీజ్ లిస్ట్ (10 మంది): మిచెల్ స్టార్క్‌తో పాటు నితీష్ రాణా, అభిషేక్ పోరెల్, బెన్ డకెట్, దుష్మంత చమీరా, కరుణ్ నాయర్ సహా 10 మందిని ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకుంది.