రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు సింగిల్ డిజిట్ సీట్లు ఖాయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు సింగిల్ డిజిట్ సీట్లు ఖాయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమే వస్తాయని  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు..ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలన్నింటినీ దశలవారీగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పేదల సంక్షేమాన్ని విస్మరించారని మంత్రి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.

ఖమ్మం జిల్లా కల్లూరులో చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నాలుగు లక్షల చేయూత పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎలాంటి రాజకీయ వివక్షకు తావు లేదని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళలకు త్వరలో మరో విడత ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. పేదలు, మహిళలు, వృద్ధులు, అర్హులైన నిరుపేద కుటుంబాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి అన్నారు.