డబ్బు లేనోడిది ఓ బాధ.. అన్నీ ఉన్న డబ్బున్నోళ్లది మరో బాధ. ఓ వైపు డబ్బులు లేక అప్పులు చేసి తిప్పలు పడుతున్న జన.. మరో వైపు ప్రతి నెలా లక్షల జీతం.. కోట్ల కొద్దీ డబ్బును వదిలేసి సన్యాసులుగా మారుతున్న వాళ్లు మరికొందరు.. దేశంలో రెండు రకాలుగా జరుగుతున్న మార్పులు అందరిలో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. నిన్నటికి నిన్న హైదరాబాద్ కు చెందిన ఓ ఐటీ ఉద్యోగి లక్షల జీతం వదిలేసి జైన మతంలోకి మారగా.. ఇప్పుడు అదే తరహా ఘటన మరొకటి జరిగింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.
కార్పొరేట్ ఉద్యోగాలు, కోట్ల రూపాయల ప్యాకేజీలు, సమాజంలో ఉన్నతమైన హోదా.. ఇవేవీ మనిషికి అసలైన మనఃశాంతిని ఇవ్వలేవని కొందరు నిరూపిస్తుంటారు. గురుగ్రామ్‌కు చెందిన 37 ఏళ్ల అక్షిత జైన్, ఆమె 61 ఏళ్ల తల్లి శిరోమణి బజాజ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సంపద, భౌతిక సుఖాలు, కార్పొరేట్ జీవితాన్ని పూర్తిగా వదులుకుని వారు జైన సన్యాస మార్గాన్ని ఎంచుకున్నారు.
అక్షిత జైన్ దేశంలోని అత్యున్నత మేనేజ్మెంట్ సంస్థ అయిన IIM బెంగళూరు నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. వోక్స్వ్యాగన్ కంపెనీలో దాదాపు రూ.50 లక్షల ప్యాకేజీ అందుకుంటూ కార్పొరేట్ జాబ్ చేశారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆ సౌకర్యవంతమైన జీవితాన్ని, కోట్ల రూపాయల సంపదను ఆమె ఒక్కక్షణం లోన వదిలేశారు. ఆమెతో పాటు ఆమె తల్లి శిరోమణి బజాజ్ కూడా ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. శిరోమణి బజాజ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో చీఫ్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టి రిటైర్ అయ్యారు.
లౌకిక ప్రపంచంలో అందరూ కోరుకునే సక్సెస్, సంపద తమకు నిజమైన శాంతిని ఇవ్వలేదని వారు భావించారు. జైన సంప్రదాయాల ప్రకారం ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని, సర్వసంగత్యాగంతో కఠినమైన సన్యాస జీవితాన్ని గడపాలని ఇద్దరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. బంధాలు, సుఖాలను విడిచి తల్లితో కలిసి కుమార్తె కూడా సాధ్విగా మారడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం సమాజంలో సక్సెస్‌కి కొలమానంగా భావించే హై పెయిడ్ జాబ్స్, భారీ వేతనాలు అందరికీ ఆనందాన్ని ఇస్తాయనే రూల్ లేదని ఈ తల్లీకూతుళ్ల ప్రయాణం నిరూపిస్తోంది.
