Anitha Chowdary: సైబర్ వలలో టాలీవుడ్ నటి అనితా చౌదరి.. చిన్న పొరపాటుతో రూ.4 లక్షలు స్వాహా!

Anitha Chowdary: సైబర్ వలలో టాలీవుడ్ నటి అనితా చౌదరి.. చిన్న పొరపాటుతో రూ.4 లక్షలు స్వాహా!

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవడానికి సామాన్యులైనా.. సెలబ్రిటీలైనా అతీతులు కాదని మరో ఘటన నిరూపించింది. రోజుకో కొత్త పంథాలో అమాయకులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు.. ఇప్పుడు టాలీవుడ్ నటిని కూడా వదల్లేదు. విమాన టికెట్లు బుక్ చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఏజెన్సీ కోసం వెతికిన నటి అనితా చౌదరిని మాటలతో బురిడీ కొట్టించి ఏకంగా రూ.4.14 లక్షలు కాజేశారు. బిజినెస్ క్లాస్ టికెట్లు బుక్ చేస్తామంటూ నమ్మించి, బ్యాంకు కార్డు వివరాలతో పాటు ఓటీపీలను సేకరించి ఖాతాకు కన్నం వేశారు. టికెట్లు రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన ఆమె పోలీసులను ఆశ్రయించారు. అసలు ఈ సైబర్ మోసం ఎలా జరిగిందనే వివరాలు ఇలా ఉన్నాయి.. 

కుమారుడి బర్త్ డేకు వెళ్లాలనుకుంటే..

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన అనితా చౌదరి హైదరాబాద్‌లోని మాదాపూర్ కావూరి హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంటున్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె విదేశీ పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో బిజినెస్ క్లాస్‌లో రాకపోకల విమాన టికెట్లు బుక్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 12న ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఏజెన్సీ కోసం వెతుకుతున్న సమయంలో 'లో ఫ్లై ట్రావెల్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్' పేరుతో ఓ సంస్థ వివరాలు కనిపించాయి. అందులో ఉన్న కాంటాక్ట్ నంబర్‌కు ఫోన్ చేయడంతో రాజేశ్ అనే వ్యక్తి ఆమెతో మాట్లాడాడు. వాషింగ్టన్ డీసీ ప్రయాణానికి బిజినెస్ క్లాస్ టికెట్ల ధర రూ.4,14,180 అవుతుందని చెప్పి బుకింగ్ ప్రక్రియను ప్రారంభించాడు.

OTP చెప్పగానే ఖాతాకు కన్నం..

టికెట్ల బుకింగ్ పూర్తి చేయాలంటే డెబిట్ కార్డు వివరాలు అవసరమని రాజేశ్ నమ్మించాడు. ఇందుకోసం ఓ ఫారం పంపించి అందులో కార్డు సమాచారాన్ని నమోదు చేయించాడు. ఆ తర్వాత ఫోన్‌లో మాట్లాడుతూ అనితను మాటల్లో నిమగ్నం చేశాడు. ఇదే సమయంలో ఆమె మొబైల్‌కు వచ్చిన ఓటీపీలను కూడా చెప్పాలని కోరాడు. టికెట్ల బుకింగ్ ప్రక్రియలో భాగంగానే ఈ వివరాలు అడుగుతున్నారని భావించిన నటి.. అతడు అడిగిన ఓటీపీలను చెప్పుకొచ్చింది. దీంతో సైబర్ నేరగాళ్లు తమ పని పూర్తి చేశారు. కొద్దిసేపటికే క్లియర్‌ట్రిప్ ద్వారా ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.4,14,180 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. అయితే డబ్బులు కట్ అయినప్పటికీ విమాన టికెట్లకు సంబంధించిన కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన అనితా చౌదరి వెంటనే బ్యాంకు కస్టమర్ కేర్‌ను సంప్రదించి కంప్లైంట్ చేసింది. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. 

రాజేశ్‌పై కేసు.. దర్యాప్తు ప్రారంభం

బాధితురాలు, నటి అనిత ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజేశ్ పేరుతో మాట్లాడిన వ్యక్తి వివరాలు, నకిలీ ట్రావెల్ ఏజెన్సీ వెనుక ఉన్న నెట్‌వర్క్, డబ్బులు ఏ ఖాతాల్లోకి బదిలీ అయ్యాయనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

టికెట్ బుకింగ్ పేరుతో మోసాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఆన్‌లైన్ సేవలు పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కూడా తమ మోసాలకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ ట్రావెల్ ఏజెన్సీలు, ఆకర్షణీయమైన ఆఫర్లతో ప్రజలను బుట్టలో వేసుకుంటున్నారు. అందుకే విమాన టికెట్లు బుక్ చేసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

  • నమ్మకమైన వెబ్‌సైట్లలోనే టికెట్లు బుక్ చేయాలి.
  • అపరిచితులకు కార్డు వివరాలు చెప్పకూడదు.
  • ఓటీపీ, యూపీఐ పిన్ ఎవరితోనూ పంచుకోవద్దు.
  • పేమెంట్ తర్వాత టికెట్, పీఎన్ఆర్ కన్ఫర్మేషన్ చెక్ చేసుకోవాలి

ఒక్క చిన్న పొరపాటు.. ఖాతాలోని భారీ మొత్తాన్ని ఖాళీ చేయగలదని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నట్లు అనుమానం వచ్చిన వెంటనే బ్యాంకును సంప్రదించడంతో పాటు జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలి లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి. అప్రమత్తతే సైబర్ మోసాల నుంచి మన డబ్బును కాపాడుకునే మొదటి ఆయుధం.

సినిమాల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న అనితా చౌదరి..

నటి అనితా చౌదరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మురారి, నువ్వే నువ్వే, వరుడు, ఉయ్యాల జంపాల, జనతా గ్యారేజ్, గురు, సారిపోదా శనివారం వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన లిటిల్ హార్ట్స్ సినిమాలో హీరో తల్లి శ్రీలత పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. అలాగే సోలో బాయ్, రాజు వెడ్స్ రాంబాయి వంటి చిత్రాల్లోనూ నటించారు. సినిమాలతో బిజీగా ఉంటున్న ఆమె.. తాజాగా సైబర్ మోసానికి గురికావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.