పెట్రోల్‌లో ఇథనాల్ ఎక్కువైంది.. ఇంజన్స్ కరాబైతున్నాయని కేంద్రానికి కర్ణాటక మంత్రి లేఖ!

పెట్రోల్‌లో ఇథనాల్ ఎక్కువైంది.. ఇంజన్స్ కరాబైతున్నాయని కేంద్రానికి కర్ణాటక మంత్రి లేఖ!

కర్ణాటక ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య ఇథనాల్ బ్లెండింగ్ వివాదం తీవ్రరూపం దాల్చింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్‌లో పరిమితికి మించి ఇథనాల్‌ను కలుపుతున్నాయని కర్ణాటక సర్కార్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. స్వతంత్రంగా నిర్వహించిన పరీక్షల్లో 14 శాంపిల్స్‌లో ఏకంగా 11 నమూనాల్లో 20 శాతానికి పైగా ఇథనాల్ ఉన్నట్లు తేలిందని.. ఒక చోట ఏకంగా 31 శాతానికి పైగా ఇథనాల్ కంటెంట్ నమోదైందని కర్ణాటక ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి రిజ్వాన్ అర్షద్ కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరికి రాసిన లేఖలో వెల్లడించారు.

అధిక ఇథనాల్ మిక్సింగ్ కారణంగా వాహనదారుల నుంచి విపరీతమైన ఫిర్యాదులు వస్తున్నాయని రిజ్వాన్ అర్షద్ ఆందోళన వ్యక్తం చేశారు. మైలేజ్ తగ్గిపోవడం, ఇంజిన్ పనితీరు దెబ్బతినడం, పాత వాహనాలు కరాబవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. E20కి తాము వ్యతిరేకం కాదని.. అయితే పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. తక్కువ ఇథనాల్ ఉన్న ఈ10, ఇథనాల్ రహిత పెట్రోల్‌ను కొనుక్కునే అవకాశాన్ని వాహనదారులకు ఇవ్వాలని, అలాగే దెబ్బతిన్న వాహనాల కోసం ప్రత్యేక నష్టపరిహార నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు పెట్రోల్‌లో ఇథనాల్ మోతాదు పరిమితిని మించిందనే ఆరోపణలపై కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి తీవ్రంగా స్పందించారు. అలాంటి వాదనలు చేసేవారు "విజ్ఞానం లేని మూర్ఖులు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించడానికి ఇథనాల్ కలపడం ఒక్కటే ఏకైక మార్గమని సమర్థించారు. కర్ణాటకతో పాటు కేరళ కూడా ఈ అంశంపై పరీక్షలు నిర్వహించి ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో.. కేంద్ర మంత్రుల నుంచి వస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగాను, దేశవ్యాప్తంగానూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.