మధిర: తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 నిర్వహణకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీలకు సంబంధించిన లోగో, మస్కట్, బ్రోచర్‌ను మంత్రి వాకిటి శ్రీహరి మధిరలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం రాష్ట్రానికి దక్కిన గొప్ప గౌరవమని అన్నారు. ఈ క్రీడా పోటీల నిర్వహణతో తెలంగాణకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.
డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
క్రీడలు కేవలం పతకాల సాధనకే పరిమితం కావని, యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి తెలిపారు. తెలంగాణ యువత విద్యతోపాటు క్రీడల్లోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 విజయవంతానికి క్రీడాకారులు, క్రీడాభిమానులు, యువతతోపాటు ప్రజలందరూ భాగస్వాములు కావాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు.క్రీడల్లో తెలంగాణ సత్తా చాటుదాం.. ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026ను విజయవంతం చేద్దామని మంత్రి ఆకాంక్షించారు.
