2027 వన్డే వరల్డ్ కప్ : భారత్, పాక్ మ్యాచ్‌కు టికెట్లు కావాలని 80 లక్షల రిక్వెస్ట్‌లు

2027 వన్డే వరల్డ్ కప్ : భారత్, పాక్ మ్యాచ్‌కు టికెట్లు కావాలని 80 లక్షల రిక్వెస్ట్‌లు

జోహన్నెస్‌బర్గ్: వచ్చే ఏడాది (2027) ఆఫ్రికా ఖండం వేదికగా జరగనున్న ఐసీసీ మెన్స్ వన్డే ప్రపంచకప్ (ICC Cricket World Cup 2027) టికెట్లకు కనీవినీ ఎరుగని రీతిలో డిమాండ్ నెలకొంది. టోర్నీ టికెట్ల కోసం ఇప్పటి వరకు ఏకంగా 14 కోట్లకు (140 మిలియన్లు) పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఐసీసీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాల నుంచి అభిమానులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారని టోర్నమెంట్ డైరెక్టర్ సారా ఎడ్గార్ (Sarah Edgar) వెల్లడించారు. టికెట్ బ్యాలెట్ ప్రక్రియ ఈ శనివారం ( నవంబర్ 21)తో ముగియనుంది.

భారత్, పాక్ మ్యాచ్‌కు 80 లక్షల రిక్వెస్ట్‌లు: 

* 2027 అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 

* ఇండో-పాక్ క్రేజ్: అక్టోబర్ 10వ తేదీన జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరగనున్న భారత్ వర్సెస్ పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్ టికెట్ల కోసం ఏకంగా 80 లక్షల (8 మిలియన్లు) దరఖాస్తులు రావడం విశేషం.

* 24 ఏళ్ల తర్వాత ఆఫ్రికాలో: 2003 ప్రపంచకప్ తర్వాత సరిగ్గా 24 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం వన్డే వరల్డ్ కప్ తిరిగి ఆఫ్రికా గడ్డపైకి వస్తోంది. ఈ 14వ ఎడిషన్‌లో మొత్తం 14 జట్లు, 57 మ్యాచ్‌లలో తలపడనున్నాయి.

12 వేదికల్లో శరవేగంగా ఏర్పాట్లు: 

* మొత్తం 12 వేదికల్లో మ్యాచ్‌లు జరగనుండగా, స్టేడియంల పనులు తుది దశకు చేరుకున్నాయని సారా ఎడ్గార్ తెలిపారు. 

* కొన్ని స్టేడియంలలో చిన్నపాటి ఆధునీకరణ పనులు జరుగుతుండగా.. జింబాబ్వేలోని విక్టోరియా ఫాల్స్, నమీబియాలోని విండ్‌హోక్ స్టేడియాలను ప్రత్యేకంగా ఈ వరల్డ్ కప్ కోసమే కొత్తగా నిర్మించారు.