భూమి పుట్టుక గుట్టు విప్పేందుకు మానవుడు ఎప్పుడూ అంతరిక్షం వైపు ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాడు. మనం తయారు చేసిన ఒక యంత్రం ఏకంగా అంతరిక్షంలో ప్రయాణం చేస్తూ సృష్టి గమనాన్నే మార్చేస్తుంటే. సరిగ్గా 49 సంవత్సరాల క్రితం.. అంటే 1977లో నింగికి ఎగిరిన నాసా 'వాయేజర్ 1' స్పేస్‌క్రాఫ్ట్ ఇప్పుడు మానవ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. 25.9 బిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. ఏకంగా 'ఒక లైట్-డే' దూరానికి చేరిన మొట్టమొదటి మానవ నిర్మిత వస్తువుగా చరిత్ర సృష్టించింది. 1970 నాటి కాలంచెల్లిన టెక్నాలజీతో అంతరిక్ష శూన్యంలో ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన ప్రయాణం తెలుసుకుందామా..
సెప్టెంబర్ 5, 1977న నాసా వాయేజర్-1ను అంతరిక్షంలోకి పంపింది. నిజానికి ఇది కేవలం మన సౌర కుటుంబంలోని బృహస్పతి, శని గ్రహాలను.. వాటి వలయాలను పరిశోధించడానికి మాత్రమే రూపొందించబడిన ప్రాజెక్ట్. కానీ ఆ కాలంలో అరుదుగా వచ్చే గ్రహాల అమరికను (Planetary Alignment) నాసా శాస్త్రవేత్తలు అద్భుతంగా ఉపయోగించుకున్నారు. 'గ్రావిటేషనల్ అసిస్ట్' అనే టెక్నిక్ ద్వారా గ్రహాల గురుత్వాకర్షణ శక్తిని బ్యాలెన్స్ చేసుకుంటూ.. ఎలాంటి అదనపు ఇంధనం లేకుండా ఈ స్పేస్‌క్రాఫ్ట్ వేల కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. 1979లో బృహస్పతిపై అగ్నిపర్వతాలను గుర్తించి అందరినీ ఆశ్చర్యపరిచిన వాయేజర్ 1.. ఆ తర్వాత శనిగ్రహాన్ని దాటి ఆగస్ట్ 2012లో సూర్డి రక్షణ వలయం 'హెలియోపాజ్'ను దాటి నక్షత్రాల మధ్య ఉన్న ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌లోకి ప్రవేశించింది.
Voyager 1 is now one light-day from Earth, an extraordinary @NASA achievement for a spacecraft assembled by human hands and launched nearly 50 years ago. As we celebrate this milestone, with Voyager continuing her journey through interstellar space at nearly 38,000 mph, consider what those brilliant minds made possible with the technology of 1977 and how much farther we should aspire to go with the tools, resources, and ambition of our time.
— NASA Administrator Jared Isaacman (@NASAAdmin) November 18, 2026
కాలం చెల్లిన టెక్నాలజీతో అద్భుతాలు:
ఇప్పుడు మనుషుల చేతుల్లో ఉన్న అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌లు, సూపర్‌కంప్యూటర్లతో పోలిస్తే వాయేజర్ 1లో ఉన్న టెక్నాలజీ చాలా పాతది. దీనికి సోలార్ ప్యానెల్స్ కూడా ఉండవు. రేడియోధార్మిక ప్లూటోనియం-238 క్షీణించడం వల్ల విడుదలయ్యే వేడిని విద్యుత్తుగా మార్చే 'ఆర్టీజీ' పవర్ సిస్టమ్‌తో ఇది నడుస్తోంది. ఏళ్ల తరబడి పవర్ తగ్గిపోతున్నప్పటికీ.. నాసా ఇంజనీర్లు అత్యంత కీలకమైన సిస్టమ్స్‌ను మాత్రమే ఉంచి, మిగిలిన వాటిని నిలిపివేస్తూ ఈ యంత్రాన్ని బతికిస్తున్నారు. ప్రస్తుతం ఇది భూమికి ఎంత దూరంలో ఉందంటే.. భూమి నుంచి పంపే ఒక రేడియో సిగ్నల్ వాయేజర్ 1కి చేరడానికి సరిగ్గా 24 గంటల సమయం పడుతోంది. అక్కడి నుంచి రిప్లై రావడానికి మరో 24 గంటలు పడుతుంది. అంటే ఏదైనా సందేశం మారకం జరగాలంటే రెండు రోజుల వ్యవధి పడుతోందన్నమాట.
భూమి జ్ఞాపకాలను మోసుకెళ్తూ..
వాయేజర్ 1 కేవలం శాస్త్రీయ పరికరాలను మాత్రమే మోసుకెళ్లడం లేదు. మానవ జాతి ఆనవాళ్లను, భూమిపై ఉన్న సంగీతం, శబ్దాలు, వివిధ భాషల్లో శుభాకాంక్షలు, చిత్రాలను పొందుపరిచిన 'గోల్డెన్ రికార్డ్'ను ఇది తన వెంట తీసుకువెళ్తోంది. భవిష్యత్తులో ఏలియెన్స్ దీనిని కనుగొంటే.. భూమిపై జీవం ఎలా ఉందనేది వారికి అర్థం కావడానికి ఈ రికార్డ్ సహాయపడనుంది.
ALSO READ : పెట్రోల్‌లో ఇథనాల్ ఎక్కువైంది.. ఇంజన్స్ కరాబైతున్నాయని కేంద్రానికి కర్ణాటక మంత్రి లేఖ!
ప్రస్తుతం గంటకు సుమారు 61వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ వ్యోమనౌక మానవ మేధస్సుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఎలాంటి మద్దతు లేకపోయినా.. 5 దశాబ్దాలుగా అంతరిక్ష రహస్యాలను ఛేదిస్తూ ముందుకు సాగుతున్న వాయేజర్ 1.. మానవ పట్టుదలకు, అన్వేషణ తృష్ణకు అసలైన ప్రతీకగా నిలుస్తోంది.
