హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల కేటాయింపునకు సంబంధించి గతంలో ఉన్న 60 రోజుల గడువును 30 రోజులకు తగ్గించింది. ఈ కొత్త నిబంధన నవంబర్ 19, 2026 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ ఇవాళ( నవంబర్ 18) ప్రకటన విడుదల చేసింది.
వాహన యజమానులు తమకు నచ్చిన ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ పొందాలంటే తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) జారీ అయిన తేదీ నుంచి 30 రోజుల్లోపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో ఈ గడువు 60 రోజులుగా ఉండేది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం దీనిని 30 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
గడువు దాటితే రాండమ్ నంబర్ కేటాయింపు
ఫ్యాన్సీ నంబర్ కావాలనుకునే వాహన యజమానులు తాత్కాలిక రిజిస్ట్రేషన్ జారీ అయిన తేదీ నుంచి 30 రోజుల్లోపు రిజర్వేషన్, బిడ్డింగ్, చెల్లింపు ప్రక్రియలను పూర్తి చేయాలని రవాణా శాఖ సూచించింది.నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియలను పూర్తి చేయకపోతే సంబంధిత వాహనానికి రాండమ్ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తామని స్పష్టం చేసింది. కాబట్టి ఫ్యాన్సీ నంబర్ పొందాలనుకునే వారు గడువును తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
వాహనాలను విక్రయించే సమయంలోనే ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్లకు సంబంధించిన కొత్త గడువు నిబంధనల గురించి కొనుగోలుదారులకు తెలియజేయాలని రవాణా శాఖ వాహన డీలర్లను కోరింది. ఈ మార్పులు నవంబర్ 19, 2026 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరిన్ని వివరాల కోసం సంబంధిత ఆర్టీఏ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.
