జుట్టు రాలడం, బట్టతల సమస్యతో బాధపడుతున్న వారికి గుడ్ న్యూస్. ఈ సమస్యలకు చెక్ పెడుతూ చైనా పరిశోధకులు 'డీట్యాంగిల్' (Detangle) పేరుతో ఒక వినూత్నమైన ఎలక్ట్రానిక్ దువ్వెనను అభివృద్ధి చేశారు. ఇది జుట్టు కుదుళ్లను ప్రేరేపించడం ద్వారా వేగంగా వెంట్రుకలు మొలిచేలా చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న హెయిర్ లాస్ ట్రీట్మెంట్ల కంటే ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని వారు పేర్కొన్నారు.
బీజింగ్‌లోని బీహాంగ్ యూనివర్సిటీకి చెందిన టీమ్ ఈ పరికరాన్ని రూపొందించింది. దీనికి సంబంధించిన పరిశోధన వివరాలు ప్రముఖ సైన్స్ జర్నల్ 'నేచర్ కమ్యూనికేషన్స్'లో ప్రచురితమయ్యాయి. సాధారణంగా మగవారిలో కనిపించే 'ఆండ్రోజెనెటిక్ అలోపేసియా' (Androgenetic alopecia) , మేల్-పాటర్న్ బాల్డ్నెస్కు ఈ పరికరం ద్వారా పరిష్కారం చూపవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఎలా పనిచేస్తుందంటే?
ఈ 'డీట్యాంగిల్' ఎలక్ట్రానిక్ దువ్వెనలో ప్రత్యేకమైన ఎలక్ట్రోడ్లు, డ్రగ్-లోడింగ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ దువ్వెనతో తల దువ్వుకున్నప్పుడు వెంట్రుకల కుదుళ్ల వద్ద ఒక రకమైన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు అవసరమైన కణాలను ఉత్తేజపరుస్తుంది.
ప్రస్తుతం జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు మార్కెట్లో మినోక్సిడిల్ (Minoxidil) వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ కొత్త ఎలక్ట్రానిక్ దువ్వెన ఆ మందుల కంటే మెరుగ్గా పనిచేస్తుందని స్టడీలో వెల్లడైంది. ఎలుకలపై నిర్వహించిన పరీక్షల్లో కేవలం ఒక నెల రోజుల్లోనే జుట్టు రికవరీ రేటు 70 శాతం నుంచి దాదాపు 100 శాతానికి పెరిగిందని పరిశోధకులు స్పష్టం చేశారు.
మెడిసిన్ తో సైడ్ ఎఫెక్స్..
ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 శాతం మంది పురుషులు తమ జీవితకాలంలో ఏదో ఒక దశలో బట్టతల సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనివల్ల చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్లలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వాటిల్లో 'మినోక్సిడిల్' వల్ల బట్టతలపై ఫలితాలను చూపించడానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. మధ్యలో దీనిని వాడటం ఆపేస్తే మళ్లీ జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. అంతే కాదు దీనివల్ల తలనొప్పి, చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.
'ఫినాస్టరైడ్' బట్టతలపై ప్రభావవంతంగానే పనిచేస్తుంది. కానీ దీని వల్ల కొంత డిప్రెషన్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. మరోవైపు కొత్త మంది బట్టతల సమస్యకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మార్గాన్ని కూడా ఎంచుకుంటున్నారు. జుట్టు తక్కువగా ఉన్న చోట కుదుళ్లను నాటే ఈ పద్ధతి ఖర్చుతో కూడుకున్నది. పైగా ఇది ఇన్వాసివ్ సర్జరీ కావడంతో కొంత నొప్పిని కలిగిస్తుంది.
క్లినికల్ ట్రయల్స్ లో..
అయితే చైనా సైంటిస్టులు రూపొందించిన ఈ ఎలక్ట్రానిక్ దువ్వెన ప్రస్తుతం ప్రయోగాత్మక దశలోనే ఉంది. ఇప్పటివరకు ఎలుకలపై మాత్రమే దీనిని పరీక్షించారు. మనుషులపై ఈ ట్రీట్మెంట్ ఎంతవరకు సురక్షితం, దీనివల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాలను తేల్చడానికి మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంది. ఆ పరీక్షలు పూర్తయ్యాక ఇది అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
