మెదక్ జిల్లా బోడ్మట్‌పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బ్రిడ్జి కింద ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా బోడ్మట్‌పల్లి సమీపంలోని 161వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి కారులో ప్రయాణిస్తుండగా, మార్గమధ్యంలో ఎదురైన ద్విచక్ర వాహనాన్ని తప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి బ్రిడ్జి కింద ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో చంద్రశేఖర్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయన సురక్షితంగా బయటపడ్డారు. పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డికి సోదరుడు. ఆయన సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా, జిల్లా కాంగ్రెస్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.
చంద్రశేఖర్ రెడ్డి కారు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ఆయనకు స్వల్ప గాయాలే కావడం, ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో ఊరట చెందారు.
