హైదరాబాద్ లో నిర్వహించే ఈవెంట్లకు కొత్త రూల్స్ ఇవే

హైదరాబాద్ లో నిర్వహించే ఈవెంట్లకు కొత్త రూల్స్ ఇవే

 సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) పరిధిలో 100 మందికి మించి పాల్గొనే కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించే నిర్వాహకులకు అధికారులు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారం బహిరంగ కార్యక్రమాలు, సమావేశాల్లో చెత్త నిర్వహణను తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు. అనుమతులు లేని ప్రదేశాల్లో నిర్వహించే కార్యక్రమాలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు.

కార్యక్రమం నిర్వహించడానికి కనీసం మూడు పని దినాల ముందే CMC అధికారులకు సమాచారం అందించాలి. ఇందుకోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) రూపొందించిన ఈవెంట్ ఇంటిమేషన్ పోర్టల్ ద్వారా ముందస్తు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

చెత్తను వేర్వేరుగా విభజించాలి

కార్యక్రమాల నిర్వహణ సమయంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను తడి, పొడి తదితర కేటగిరీలుగా తప్పనిసరిగా వేరు చేయాలి. ఇలా వేరు చేసిన చెత్తను స్థానిక సంస్థ గుర్తించిన అధీకృత ఏజెన్సీలకు మాత్రమే అప్పగించాలి. వ్యర్థాల సేకరణ, రవాణా, శాస్త్రీయ పద్ధతుల్లో తరలింపునకు అవసరమైన ఏర్పాట్లన్నీ కార్యక్రమ నిర్వాహకులే చేసుకోవాలని CMC స్పష్టం చేసింది.

డిప్యూటీ కమిషనర్లకు కీలక ఆదేశాలు

ఈ మార్గదర్శకాలపై ఫంక్షన్ హాళ్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు, ఇతర కార్యక్రమాల నిర్వాహకులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని డిప్యూటీ కమిషనర్లను CMC ఆదేశించింది. CPCB ఈవెంట్ ఇంటిమేషన్ పోర్టల్ వినియోగంపై కూడా నిర్వాహకులకు అవగాహన కల్పించాలని సూచించింది.నిబంధనల అమలును నిరంతరం పర్యవేక్షించాలని, ఇందుకోసం శానిటేషన్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

సైబరాబాద్ పరిధిలో జరిగే బహిరంగ కార్యక్రమాలు, సమావేశాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని CMC కమిషనర్ స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పరిశుభ్రతను కాపాడేందుకు నిర్వాహకులంతా ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.