ఏపీ ఎన్నికలు: పంచాయితీ ఎన్నికల నామినేషన్లలో టీడీపీ వర్సెస్ వైసీపీ...!

ఏపీ ఎన్నికలు: పంచాయితీ ఎన్నికల నామినేషన్లలో టీడీపీ వర్సెస్ వైసీపీ...!

ఏపీలో పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ల ప్రక్రియ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి విడత పంచాయితీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ఇప్పటికే ముగియగా..బుధవారం ( నవంబర్ 18 ) నుంచి 20 వరకు రెండో విడత పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో పంచాయితీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా కడప జిల్లాలోని వేంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. వేంపల్లి మండలం రామిరెడ్డిపల్లెలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది.

వైసీపీ మద్దతుతో నామినేషన్లు వేసేందుకు వెళ్లిన అభ్యర్థులను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య నెలకొంది. రామిరెడ్డిపల్లి, ముత్తుకూరు , నాగురు, పాములూరు, అయ్యవారిపల్లె గ్రామాలకు రామిరెడ్డిపల్లి లో నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు అధికారులు.

ఈ క్రమంలో రామిరెడ్డిపల్లిలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్నారు టీడీపీ శ్రేణులు. నందిపల్లి మాజీ సర్పంచ్ మారం సులోచన కుమారుడు శ్రీకాంత్ రెడ్డికి, టీడీపీ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.ఇరువర్గాల మధ్య ఘర్షణతో రామిరెడ్డిపల్లెలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

ఈ క్రమంలో నామినేషన్ల సమయంలోనే ఈ రేంజ్ లో ఘర్షణలు నెలకొంటే.. పోలింగ్ రోజున ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.