ప్రపంచవ్యాప్తంగా GTA 6 మానియా.. పోటీపడి సెలవు ప్రకటించిన కార్పొరేట్ కంపెనీలు

ప్రపంచవ్యాప్తంగా GTA 6 మానియా.. పోటీపడి సెలవు ప్రకటించిన కార్పొరేట్ కంపెనీలు

Grand Theft Auto VI: ప్రపంచం మొత్తం ఇప్పుడు GTA 6 (Grand Theft Auto VI) గేమ్ పై ఉర్రూతలూగుతోంది. రేపు (2026, నవంబర్ 19, గురువారం) GTA 6 గేమ్ విడుదల అవుతుండటంతో.. గేమింగ్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ గేమ్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా.. ఇండియాలోని చాలా కార్పొరేట్ కంపెనీలు పోటీ పడి మరీ సెలవులు ప్రకటించేస్తున్నాయి. GTA 6 గేమ్ ను ఆస్వాదించండి అంటూ వేతనంతో కూడిన సెలవు ప్రకటించాయి ఆయా కంపెనీలు.

13 ఏళ్ల నిరీక్షణ.. వైస్ సిటీకి రీ-ఎంట్రీ: 

రాక్‌స్టార్ గేమ్స్ (Rockstar Games) అభివృద్ధి చేసిన GTA 6, ఇటీవలి సంవత్సరాలలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వీడియో గేమ్‌లలో ఒకటి. 2013లో గ్రాండ్ థెఫ్ట్ ఆటో V (GTA 5) విడుదలైన సరిగ్గా 13 సంవత్సరాల తర్వాత ఈ గేమ్ వస్తోంది. మయామి స్ఫూర్తితో రూపొందించిన కల్పిత నగరమైన వైస్ సిటీకి ఆటగాళ్లను ఈ గేమ్ తిరిగి తీసుకువెళుతుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. మరింత లీనమయ్యే పరిసరాలు, అద్భుతమైన గ్రాఫిక్స్, అధునాతన సిమ్యులేషన్‌తో ఈ గేమ్ గేమింగ్ హిస్టరీలోనే సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమైంది.

GTA 6 కోసం సెలవులు ప్రకటించిన కంపెనీలు ఇవే: 

Inde by ChairsCarte (చెన్నై, భారత్): Inde by ChairsCarte వ్యవస్థాపకుడు, సీఈఓ కిషోర్ షణ్ముగమ్ తమ ఉద్యోగులు, ఇంటర్న్‌లు, ఫ్రీలాన్సర్‌లందరికీ నవంబర్ 19వ తేదీన పూర్తి స్థాయి పెయిడ్ లీవ్ ప్రకటించారు. మేము వైస్ సిటీ, GTA V లతో పెరిగాము.. ఇది మరో సాధారణ గురువారం కాదంటూ ఆయన చేసిన పోస్ట్ వైరల్ అయింది.

boAt (బోట్) (భారత్): ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ తమ ఉద్యోగులకు రేపు (నవంబర్ 19న) ఆప్షనల్ హాలిడేతో పాటు అదనపు సెలవును అందించింది.

Influish (భారత్): ఈ భారతీయ స్టార్టప్ సంస్థ తమ 50 మంది ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించడమే కాకుండా, ప్లేస్టేషన్ 5 (PS5) లేని ఉద్యోగులు ఆఫీసులోని గేమింగ్ సెటప్‌ను ఉపయోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Logitech (అంతర్జాతీయ సంస్థ): అంతర్జాతీయ టెక్ దిగ్గజం లాజిటెక్ తమ లాజి గేమ్ డే (Logi Game Day) కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 7,000 మంది ఉద్యోగులకు ఈ గేమ్ ఆడుకోవడానికి ఒక రోజు వేతనంతో కూడిన హాలీడే ఇచ్చింది.

Burger Motorsports (కాలిఫోర్నియా, అమెరికా): ఉద్యోగుల నుంచి భారీగా సెలవు ఇవ్వాలనే అభ్యర్థనలు రావడంతో, వాటిని సర్దుబాటు చేయడానికి రేపు (నవంబర్ 19) తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

* ఇతర సంస్థలు: పైన పేర్కొన్న కంపెనీలే కాకుండా Posh Management, Tripoholic లాంటి సంస్థలు కూడా GTA 6 విడుదల రోజున తమ సిబ్బందికి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించాయి. 

American Army Special Passes To Soldiers: కేవలం కార్పొరేట్ కంపెనీలే కాకుండా, అమెరికా సైన్యం కూడా GTA 6 క్రేజ్‌కు తగ్గట్టుగానే స్పందించింది. రేపు (నవంబర్ 19) విడుదల కానున్న GTA 6ను ఆడేందుకు, యూఎస్ సైన్యం తమ విధుల్లో ఉన్న సైనికులకు నాలుగు రోజుల పాస్‌ను అందించింది. జార్జియాలోని ఫోర్ట్ స్టీవార్ట్‌లో ఉన్న 3వ పదాతిదళ విభాగం, పునః నమోదు ఒప్పందంపై సంతకం చేసే సైనికులకు ఈ ప్రత్యేక పాస్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. 

సోషల్ మీడియాలో ఈ కంపెనీల నిర్ణయంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఉద్యోగులను ఇంత బాగా చూసుకునే కంపెనీల్లో పని చేయాలని ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా, గేమింగ్ లోకం మాత్రం రేపటి (నవంబర్ 19) కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.