ఏపీతో లాలూచీ పడే ప్రసక్తే లేదు.. సొరంగం పనులు ఆపేయ్యాలని కేంద్రానికి చెప్పినం: మంత్రి ఉత్తమ్

ఏపీతో లాలూచీ పడే ప్రసక్తే లేదు.. సొరంగం పనులు ఆపేయ్యాలని కేంద్రానికి చెప్పినం: మంత్రి ఉత్తమ్

నాగార్జున సాగర్ నీటి వాటా భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏపీ  ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వంతో లాలూచీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కృష్ణా జలాల్లో ప్రతి చుక్క నీటి కోసం పోరాడుతామని ప్రకటించారు.

రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ పదేపదే తప్పుడు ప్రచారం చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజలకు బీఆర్ఎస్ పచ్చి అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. సాగునీటి అంశంపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదన్నారు.


జల్ జీవన్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1.8 టీఎంసీల నీటిని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి ఆరోపించారు. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి ఈ నీటిని తోడుకునే ప్రయత్నంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లామని వెల్లడించారు. ఏపీ ప్రయత్నాలను అడ్డుకుంటున్నామని స్పష్టం చేశారు.

కృష్ణా బేసిన్‌లో ఎక్కువ నీటిని వినియోగించింది తమ ప్రభుత్వ హయాంలోనేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు 1,998 టీఎంసీల నీరు మాత్రమే వినియోగించుకునే పరిస్థితి ఏర్పడిందని, అదే సమయంలో ఏపీ 8 వేల టీఎంసీలకు పైగా నీటిని అదనంగా వినియోగించుకుందని ఆరోపించారు.ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ 98.16 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకోగా, తెలంగాణ 108 టీఎంసీల నీటిని వినియోగించుకుందని తెలిపారు. ఏపీ కంటే తెలంగాణే ఎక్కువ కృష్ణా జలాలను వాడుకుందని వివరించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్, జగన్ కుమ్మక్కై తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించారనే ఆరోపణలను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. అప్పట్లో నాగార్జున సాగర్‌పైకి ఏపీ పోలీసులు రాలేదా అని ప్రశ్నించారు. 299 టీఎంసీల నీరు చాలని అంగీకరించి తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే నిర్ణయం తీసుకుంది మీరే కాదా అంటూ బీఆర్ఎస్‌ను నిలదీశారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ పాత్ర కీలకమని, ఆమె చొరవ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబానికి పదవులు రావడానికి కూడా సోనియా గాంధీ కారణమని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తిచేశారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నుంచి రూ.90 వేల కోట్ల విలువైన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిందని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం ఉందని, ఈ నేపథ్యంలో వ్యవసాయానికి సంబంధించి కొన్ని సూచనలు మాత్రమే చేశామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా క్రాప్ హాలిడే ప్రకటించలేదని స్పష్టం చేశారు. వరి సాగు చేయొద్దని మాత్రమే సూచించామని తెలిపారు. బీఆర్ఎస్ మాదిరిగా తప్పుడు హామీలు, అసత్య ప్రచారాలు చేయడం తమకు తెలియదని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.