GTA 6 రిలీజ్‌కు ముందు సింగపూర్‌కు చెందిన ఒక జంట రూపొందించిన 'గేమింగ్ అగ్రీమెంట్' సోషల్ మీడియాలో వైరల్ అయింది. నవంబర్ 19 నుంచి 10 రోజులపాటు భర్త అంతరాయం లేకుండా గేమ్ ఆడటానికి భార్య అనుమతిస్తూ సంతకం చేసిన ఈ అగ్రిమెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ అగ్రిమెంట్ చదివి చాలామంది నవ్వుకుంటుంటే... మరికొంతమంది విమర్శిస్తున్నారు.
యూట్యూబర్ జులియన్ టే, అతని భార్య లీసా చాన్ కలిసి ఈ ఒప్పందాన్ని ఫ్రేమ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. నవంబర్ 19 నుంచి 29 వరకు గేమ్ రిలీజ్ తేదీ మారితే, తదనుగుణంగా ఒప్పందం కాలం కూడా మారుతుందని అందులో పేర్కొన్నారు. ఒప్పందంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం — మిషన్ నడుస్తున్న సమయంలో Tay ని డిస్టర్బ్ చేయకూడదు. హగ్స్, కిస్సులు, సంభాషణలు, పనులు చెప్పడం వంటివి మిషన్ పూర్తయిన తర్వాత లేదా తను గేమ్ ఆపడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే చేయవచ్చు. గేమ్‌లో కాల్పనిక పాత్రలతో డేటింగ్ చేయడం లేదా స్ట్రిప్ క్లబ్‌కు వెళ్లడం వంటివి అన్నీ ఫిక్షనే అని భార్య గుర్తించినట్లుగా కూడా ఒప్పందంలో రాశారు.
టే తన త్రెడ్స్ అకౌంట్లో భార్య ఒప్పందంపై సంతకం చేస్తున్న ఫొటోలు, వీడియో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌కు సుమారు 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
కొందరు దీన్ని జోక్ గా తీసుకుంటే... మరికొందరు ఇది మహిళల పట్ల వివక్ష అని, ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి 'జోక్స్' చేయడం వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని అంటున్నారు. భర్తను వదిలేయమని చాలామంది నెటిజన్స్ చాన్ కు సూచించారు.
తమ అగ్రిమెంట్ పట్ల ఇంత హేట్ వస్తుందని తాను ఊహించలేదని టే అన్నారు. అయితే..ఇది రివర్స్ అయి భార్య చేసి ఉంటే అందరూ చప్పట్లు కొట్టేవారని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఇది కేవలం జోక్ కోసం చేశామని.. ఇద్దరం కలిసి అప్పుడప్పుడు సిల్లీ కంటెంట్ చేస్తుంటామని అన్నారు టే దంపతులు. మేము ఒకరినొకరం ప్రేమించుకుంటామని.. మా సంబంధం కంటే ఒక వీడియో గేమ్ ముఖ్యం కాదని అన్నారు. కేవలం ఒక పోస్ట్ చూసి తమ రిలేషన్ ని జడ్జ్ చేయద్దని కోరారు టే దంపతులు.
