మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలో పఠన సంస్కృతిని ప్రోత్సహించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న పాత పుస్తకాలను సేకరించి, వాటిని అవసరమైన విద్యార్థులు, పాఠకులకు అందించేందుకు ప్రత్యేక వాహనాన్ని ప్రారంభించింది. ప్రతి పాత పుస్తకానికి కొత్త పాఠకుడు అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా పుస్తకాల పునర్వినియోగంతో పాటు విద్యార్థులు, యువతలో పఠనాసక్తిని పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పాత పుస్తకాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాన్ని జోనల్ కమిషనర్ వికాస్ మహతో ప్రారంభించారు. ఇళ్లలో చదివి పక్కన పెట్టిన పుస్తకాలు, ప్రస్తుతం వినియోగంలో లేని పుస్తకాలను ఈ వాహనం ద్వారా సేకరించనున్నారు. సేకరించిన పుస్తకాలను అవసరమైన వారికి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా విజ్ఞానాన్ని మరింత మందికి చేరువ చేయాలని ఎంఎంసీ భావిస్తోంది.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం వినియోగంలో లేని ప్రభుత్వ భవనాలను గుర్తించి వాటిని గ్రంథాలయాలు, విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టనున్నారు. అందుబాటులో ఉన్న భవనాలను ప్రజలకు ఉపయోగపడేలా మార్చి విద్యార్థులు, యువత చదువుకునేందుకు అనువైన వాతావరణం కల్పించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజల భాగస్వామ్యం కీలకమని అధికారులు పేర్కొంటున్నారు. తమ ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న పాత పుస్తకాలను ప్రత్యేక వాహనానికి అందించి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలా సేకరించిన పుస్తకాలు మరో విద్యార్థికి, పాఠకుడికి ఉపయోగపడటంతో పాటు సమాజంలో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచుతాయని భావిస్తున్నారు.
