హైదరాబాద్ లో భూగర్భ జలాల పెంపుతో పాటు వర్షాకాలంలో వరద ముప్పును తగ్గించేందుకు హైడ్రా శాస్త్రీయ కార్యాచరణకు సిద్ధమవుతోంది. వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా ఒడిసిపట్టి, భూగర్భంలోకి ఇంకించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పలు ప్రభుత్వ సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలతో సమావేశమై కీలక అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI), గ్రౌండ్ వాటర్ విభాగం, భారత వాతావరణ శాఖ (IMD), తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) ప్రతినిధులు పాల్గొన్నారు. అర్బన్ ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఫేజ్-3, క్యూర్ (CURE) పరిధిలో చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.
భూగర్భ జలాల పరిస్థితిపై అధ్యయనం
నగరంలో భూగర్భ జలాలు అధికంగా ఉన్న ప్రాంతాలు, నీటి మట్టాలు తక్కువగా ఉన్న ప్రాంతాలను శాస్త్రీయంగా గుర్తించడంపై సమావేశంలో చర్చించారు. భౌగోళిక పరిస్థితులు, భూస్వరూపం, భూగర్భ పొరలు, నేల స్వభావాన్ని విశ్లేషించి భూగర్భ జలాల రీఛార్జ్కు అనువైన ప్రాంతాలను ఎంపిక చేయాలని నిర్ణయించారు.
వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు రీఛార్జ్ పిట్స్ ఏర్పాటు చేయడంతో పాటు నగరంలోని చెరువులు, స్టెప్వెల్స్ను అభివృద్ధి చేయడం ద్వారా భూగర్భ జలాల నిల్వ సామర్థ్యాన్ని పెంచే అవకాశాలను పరిశీలించారు. రీఛార్జ్ జోన్లు, డిశ్చార్జ్ జోన్ల గుర్తింపుతో పాటు భూగర్భ జలాల రీఛార్జ్ సామర్థ్యం, నీటి నాణ్యతపై అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని చర్చించారు.
నగరంలో వరద నీటిని సమర్థవంతంగా ఒడిసిపట్టేందుకు క్యాచ్మెంట్, సబ్ క్యాచ్మెంట్ ప్రాంతాలుగా విభజించి కార్యాచరణ రూపొందించడంపై చర్చ జరిగింది. భౌగోళిక, భూస్వరూప మ్యాపింగ్ ఆధారంగా ఏ ప్రాంతంలో ఎంత వర్షపు నీరు చేరుతోంది? ఎక్కడ నీరు నిలిచిపోతోంది? ఎక్కడ భూగర్భంలోకి ఇంకించే అవకాశం ఉంది? అనే అంశాలను విశ్లేషించనున్నారు.ఈ అధ్యయనం ద్వారా వరద ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తించడంతో పాటు వర్షపు నీటిని నిల్వ చేయడం, భూగర్భ జలాలను పెంచడం వంటి చర్యలను సమన్వయంతో చేపట్టే అవకాశం ఉంటుంది.
25 ఏళ్ల వర్షపాత డేటా విశ్లేషణ
2000 నుంచి 2025 వరకు 25 ఏళ్ల వర్షపాత గణాంకాలను విశ్లేషించాలని సమావేశంలో నిర్ణయించారు. వార్షిక, నెలవారీ వర్షపాతం వివరాలతో పాటు అత్యధిక వర్షపాతం నమోదైన సందర్భాలు, వర్షం తీవ్రత, నీటి నిల్వ సామర్థ్యంపై అధ్యయనం చేయనున్నారు. నగరంలో వర్షపాతాన్ని మరింత కచ్చితంగా నమోదు చేసేందుకు కొత్త ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు (AWS), ఆటోమేటిక్ రెయిన్ గేజ్ (ARG) కేంద్రాల ఏర్పాటుపైనా శాస్త్రవేత్తలతో చర్చించారు. అవసరమైన ప్రాంతాలను గుర్తించి వాతావరణ సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసే ప్రతిపాదనలను పరిశీలించారు.
