1989లో హైదరాబాద్‌లోని బాలానగర్‌లో రూ.5 లక్షల పెట్టుబడితో ఒక చిన్న ఫాబ్రికేషన్ యూనిట్ స్థాపించారు పామిరెడ్డి పిచ్చిరెడ్డి. మూన్సిపల్ ప్రాజెక్టులకు పైపులు తయారు చేయడంతో మొదలైన ఆ బిజినెస్.. మూడు దశాబ్దాల తర్వాత రూ.42 వేల కోట్లకు పైగా రెవెన్యూతో దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది.
ఏపీలోని కృష్ణా జిల్లా, డోకిపర్రు గ్రామంలో 1957లో ఒక రైతు కుటుంబంలో పుట్టిన పీపీ రెడ్డి.. మెగా ఇంజినీరింగ్ ఎంటర్ప్రైసెస్ అనే పేరుతో కంపెనీని స్థాపించారు. ఆ కంపెనీయే ఇప్పుడు మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL)గా మారింది. 1990ల మధ్య నాటికి కంపెనీ తాగునీరు, నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టడం మొదలు పెట్టింది. అంటే పైపుల తయారీ నుండి ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ వైపు మళ్లింది. 1991లో పీపీ రెడ్డి మేనల్లుడు పీవీ కృష్ణారెడ్డి కూడా బిజినెస్‌లోకి వచ్చారు. ఇద్దరూ కలిసి రోడ్లు, ట్రాన్స్‌పోర్టేషన్ వంటి రంగాల్లోకి విస్తరించారు. 2006లో కంపెనీ పేరు MEIL గా మారింది.
2018 ఆర్థిక సంవత్సరానికి గాను MEIL కన్సాలిడేటెడ్ రెవెన్యూ రూ.19,237 కోట్ల నుండి FY25 నాటికి రూ.42,669 కోట్లకు పెరిగిందని ట్రాక్సెన్ పేర్కొంది. అదే కాలానికి సంబంధించి నెట్ ప్రాఫిట్ రూ.2వేల 435 కోట్ల నుండి రూ.3,072 కోట్లకు చేరినట్లు తెలిపింది. 2025 ఆర్థిక సంవత్సరంలో EBITDA సుమారు రూ.7,200 కోట్లుగా నమోదైంది.
MEIL చేపట్టిన పెద్ద ప్రాజెక్టుల్లో తెలంగాణలోని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, మిషన్ భగీరథ తాగునీటి పథకం ప్రధానమైనవి. నేషనల్ హైవే ప్రాజెక్టులు, ముంబై కోస్టల్ రోడ్ పనులు కూడా ఈ కంపెనీ చేస్తున్న పనుల్లో ఉన్నాయి.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టులకే పరిమితం కాకుండా MEIL గ్రూప్ ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసే ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ నిర్వహించే మేఘా గ్యాస్, ఇటాలియన్ డ్రిల్లింగ్ రిగ్ తయారీ కంపెనీ డ్రిల్మెక్ వంటి వ్యాపారాల్లోకి కూడా అడుగు పెట్టింది.
MEIL వెబ్సైట్ ప్రకారం కంపెనీ ఇప్పుడు 20 కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇరిగేషన్, తాగునీరు, హైవేలు, టన్నెళ్లు, పవర్, రిన్యూవల్ ఎనర్జీ, హైడ్రో కార్బన్ రంగాల్లో పని చేస్తోంది. ఫోర్బ్స్ ఇండియా అంచనా ప్రకారం పీపీ రెడ్డి నెట్ వర్త్ ప్రస్తుతం 1.9 బిలియన్ డాలర్లు — అంటే సుమారు రూ.18 వేల కోట్లు. ఆయన సంపదలో ఎక్కువ భాగం MEIL లో వాటా ద్వారా వచ్చిందని సంస్థ తెలిపింది.
