మేడ్చల్ జిల్లాలో ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య

మేడ్చల్ జిల్లాలో ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎన్ఎఫ్‌సీ నగర్‌కు చెందిన 22 ఏళ్ల యువతి, ఉప్పల్ చిలుకానగర్‌కు చెందిన జామ కిరణ్‌కుమార్‌ (28) కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు కిరణ్‌కుమార్‌ కుటుంబాన్ని సంప్రదించి పెళ్లి విషయమై మాట్లాడినప్పటికీ వారు అంగీకరించలేదు.

అనంతరం కిరణ్‌కుమార్‌ కూడా పెళ్లికి నిరాకరించినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి బుధవారం (నవంబర్ 18) సాయంత్రం ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం (నవంబర్ 19) మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.