లక్నో: వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య నుంచి పోటీ చేయాలన్న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సవాల్‌ను సీఎం యోగి స్వీకరించారు. అయోధ్య నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధమని యోగి ప్రకటించారు. దమ్ముంటే అఖిలేష్ కూడా అయోధ్య నుంచే తనపై పోటీ చేయాలని ఆయన ప్రతి సవాల్ విసిరారు. అఖిలేష్‌తో ముఖాముఖి పోటీకి తాను సిద్ధమని ప్రకటించారు. ప్రత్యక్ష ఎన్నికల పోటీలో తనను ఎదుర్కొనే ధైర్యం అఖిలేష్‌కు లేదని విమర్శించారు. బలహీనులు ఎప్పుడూ తెర వెనుక నుంచి దాడి చేస్తారని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం (నవంబర్ 19) గోరఖ్‌పూర్ జిల్లాలోని క్యాంపియర్గంజ్లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం యోగి మాట్లాడుతూ.. సమాజ్‌వాదీ పార్టీ హయాంలో మాఫియా, అరాచకం, అల్లర్లు, కర్ఫ్యూలు ఉండేవని ఆరోపించారు. అలాగే, యువత ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని, మహిళలు, వ్యాపారుల భద్రతకు ముప్పు వాటిల్లిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎస్పీకి ప్రతి మాఫియా ముఠా మిత్రపక్షమేనని.. ప్రజలను ఆ పార్టీ ఎప్పుడూ మోసం చేస్తోందని విమర్శించారు.
మాఫియా కార్యకలాపాలకు పాల్పడేవారిని చట్టం ద్వారా కఠినంగా అణచివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. నేరాలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరించారు. బీజేపీ సర్కార్ ఇప్పటికే గూండాలు, మాఫియా ముఠాల ఆగడాలను నియంత్రించిందని తెలిపారు.
బుధవారం (నవంబర్ 18) గోరఖ్‌పూర్‌లో అఖిలేష్ యాదవ్ రోడ్‌షో సందర్భంగా 13 ఏళ్ల బాలుడు మృతి చెందడంపై సీఎం యోగి స్పందించారు. ఈ ఘటనను విషాదకరమైనదిగా అభివర్ణించిన ఆయన.. గూండాయిజం, అరాచకం, అల్లర్లు, అరాచకత్వాన్ని సమాజ్‌వాదీ పార్టీ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ఆ బాలుడి విషయంలో ప్రతిపక్షాలు కనీసం సంతాపం కూడా తెలియజేయలేదని విమర్శించారు. బాధిత కుటుంబాన్ని తాను పరామర్శిస్తానని చెప్పారు. వీధుల్లో అశాంతికి కారణమవుతున్న వారిని గుర్తించి, బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
