Arjun Sarja: నా కూతురి క్యారెక్టర్‌పై అలా మాట్లాడితే ఊరుకోను.. అర్జున్ సర్జా సీరియస్ వార్నింగ్!

Arjun Sarja: నా కూతురి క్యారెక్టర్‌పై అలా మాట్లాడితే ఊరుకోను.. అర్జున్ సర్జా సీరియస్ వార్నింగ్!

తన పెద్ద కుమార్తె, నటి ఐశ్వర్య వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు నటుడు అర్జున్ సర్జా. ఈ వ్యవహారంపై ఇప్పటికే అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు  తెలిపారు.. ఐశ్వర్యపై వస్తున్న వార్తలు నిరాధారమైనవని, ఆమె ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన సీరియస్ అయ్యారు.

అర్జున్ రెండో కుమార్తె అంజనా అర్జున్ వివాహం ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోల్లో ఐశ్వర్య భర్త, నటుడు ఉమాపతి రామయ్య కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఉమాపతి గైర్హాజరుపై నెట్టింట చర్చ జరగడంతో, ఐశ్వర్య వైవాహిక జీవితం గురించి అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ పూకార్లపై క్లారిటీ ఇస్తూ..  అర్జున్ నవంబర్ 19న ఒక ప్రకటన విడుదల చేశారు.

అంజన పెళ్లి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు చెబుతూనే, ఇలాంటి వ్యక్తిగత విషయంపై తాను బహిరంగ ప్రకటన చేయాల్సి వస్తుందని ఊహించలేదని అన్నారు. తన కుమార్తె ప్రైవసీని గౌరవించి ఇప్పటివరకు ఈ విషయంపై మౌనంగా ఉన్నానని అర్జున్ తెలిపారు. ప్రతి మహిళకు తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుందని, తన గురించి తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకునే స్వేచ్ఛ ఐశ్వర్యకు ఉందని ఆయన స్పష్టం చేశారు.

అయితే, ఐశ్వర్య వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వస్తున్న వ్యాఖ్యలపై తాను మౌనంగా ఉండలేనని అర్జున్ చెప్పారు. ముఖ్యంగా ఆమెను 'మద్యానికి బానిస'గా చిత్రీకరిస్తూ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.. ఇవి బాధ్యతారహితమైన ఆరోపణలని, ఏమాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు.  పబ్లిక్ లో ఉన్నప్పటికీ ఎవరిపైనైనా వ్యక్తిగత దాడులు చేసే లేదా నిరాధారమైన ఆరోపణలు చేసే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. 

కొన్ని మీడియా సంస్థలు నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలకు ప్రాధాన్యత ఇవ్వడం, కేవలం వ్యూస్ కోసం ప్రైవేట్ విషయాలను సెన్సేషనలైజ్ చేయడం సరికాదని విమర్శించారు. ఇటువంటి ఆరోపణలు ఒక మహిళ గౌరవానికి, మనశ్శాంతికి భంగం కలిగిస్తాయని అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు.  ఐశ్వర్యకు తన కుటుంబం పూర్తి అండగా ఉంటుందని, ఆమె ఆత్మగౌరవంతో, స్వతంత్రంగా జీవించే హక్కును తాము సమర్థిస్తామని అర్జున్ చెప్పారు. ఈ తప్పుడు వార్తలను ఇంకా ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వ్యక్తిగత గౌరవం విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు...