తెలంగాణ తొలి దశ ఉద్యమంలో సిద్దిపేటకు చెందిన మదన్ మోహన్ కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సిద్దిపేట బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్... 1983లో సిద్దిపేట నుంచి కేసీఆర్ను మదన్ మోహన్ ఓడించారని ప్రస్తావించారు. ఆయన సేవలను గుర్తిస్తూ సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు పెట్టాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు.
మదన్ మోహన్ పేరు కనుమరుగయ్యేలా కేసీఆర్, హరీశ్ రావు ప్రయత్నించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసేందుకు కుట్రలు చేశారని విమర్శించారు. రానున్న రోజుల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు మంత్రిని చేస్తే కేసీఆర్ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ భిక్షతోనే హరీశ్ రావు మంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వెంట తిరిగిన వారిలో ఎంతమందికి పదవులు వచ్చాయని ప్రశ్నించారు.
మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ పరిస్థితిని కూడా సీఎం ప్రస్తావించారు. హరీశ్ రావు వేల కోట్లు సంపాదించారని ఆరోపిస్తూ, మరోవైపు సోలిపేట రామలింగారెడ్డి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు.
