తెలంగాణలో భిన్న వాతావరణం.. హైదరాబాద్‌లో చలి, తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు!

తెలంగాణలో భిన్న వాతావరణం.. హైదరాబాద్‌లో చలి, తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు!

హైదరాబాద్: తెలంగాణలో వాతావరణం మారుతోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాలను ఆక్వాన్  తుపాను ప్రభావం ఆందోళనకు గురిచేస్తుండగా.. హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో మాత్రం చల్లటి, పొడి వాతావరణం కొనసాగనుంది. మరోవైపు తెలంగాణ తూర్పు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

ఉత్తర దిశ నుంచి వీస్తున్న పొడి చల్లటి గాలుల ప్రభావంతో పశ్చిమ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. పగటిపూట తేమ శాతం తక్కువగా ఉండటంతో వాతావరణం పొడిగా ఉంటోంది. హైదరాబాద్‌ ప్రధాన ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 నుంచి 31 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదవుతున్నాయి.

నగర శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, పటాన్‌చెరువుతో పాటు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాల్లో తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు 12 నుంచి 16 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతోంది.

నవంబర్ 22 నుంచి స్వల్పంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు

ఆక్టాన్ తుపాను తీరం దాటిన తర్వాత నవంబర్ 22 నుంచి హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని IMD హైదరాబాద్ కేంద్రం అంచనా వేసింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల సెల్సియస్‌కు చేరవచ్చని తెలిపింది.

వాతావరణ శాఖ విడుదల చేసిన ఏడు రోజుల స్థానిక అంచనా ప్రకారం నవంబర్ 25 వరకు హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, పొగమంచు లేదా మసక వాతావరణం కనిపించే అవకాశం ఉంది. మొత్తంగా నగరంలో చల్లటి, పొడి వాతావరణం కొనసాగనుంది.

మరోవైపు రాష్ట్రంలోని తూర్పు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది.  అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.