రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ సొమ్మును ఒకేసారి తీసుకునే పద్ధతికి స్వస్తి చెప్పి.. నెలనెలా విడతలవారీగా పొందే ‘సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్’(SWP)కి ఈపీఎఫ్ఓ ఆమోదం తెలిపింది. పదవీ విరమణ తర్వాత ఆర్థిక అవసరాలను సక్రమంగా నిర్వహించుకునేందుకు ఇది ఖాతాదారులకు అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది. తొలి దశలో 55 ఏళ్లు పైబడిన 6లక్షల 30వేల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు ఈ సదుపాయం వల్ల లబ్ధి చేకూరుతుందని అంచనా.
SWP ద్వారా రిటైరైన సభ్యులు తమ మొత్తం పీఎఫ్ సొమ్మును ఒకేసారి తీసుకోకుండా.. క్రమం తప్పకుండా వాయిదాల రూపంలో విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలా తీసుకోగా మిగిలిన బ్యాలెన్స్ ఈపీఎఫ్ వ్యవస్థలోనే ఉండి.. ప్రభుత్వం అందించే వడ్డీ వస్తూనే ఉంటుంది.
ఇందులో అనేక సౌకర్యవంతమైన ఆప్షన్లు ఉండనున్నాయి. కార్పస్ నుంచి నిర్ణీత వ్యవధిలో విత్‌డ్రా చేసుకోవడం, కొంత మొత్తాన్ని ముందుగానే తీసుకుని మిగిలిన దానిపై వాయిదాలు పొందడం లేదా కేవలం వచ్చే వడ్డీని మాత్రమే తీసుకునే వెసులుబాటు లభించవచ్చు. అలాగే రూల్స్ ప్రకారం అవసరమైనప్పుడు ఈ విత్‌డ్రాయల్ ప్లాన్‌ను ఆపేసి మిగిలిన డబ్బులు ఒకేసారి తీసుకునే సౌలభ్యం కూడా కల్పించనున్నారు.
రిటైర్మెంట్ తర్వాత కూడా స్వచ్ఛందంగా పీఎఫ్‌లో జమ చేసే మార్గాలను ఈ ఫ్రేమ్‌వర్క్ తీసుకురానుంది. పేరోల్ ద్వారా అదనపు డబ్బు జమ, నేరుగా డిపాజిట్లు, డిజిటల్ పేమెంట్ల ద్వారా చిన్న మొత్తాల జమ వంటివి ఇందులో భాగం కావచ్చు.
అంతేకాదు.. గిగ్ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికులకు కూడా ఇది దారి చూపనుంది. టిప్స్, బహుమతులు, ఇతర అదనపు ఆదాయాలను డిజిటల్ చెల్లింపుల ద్వారా చిన్న మొత్తాలుగా పీఎఫ్ ఖాతాలో జమ చేసే అవకాశం ఉంది.
