ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. డబ్బు విత్‌డ్రా లిమిట్ 90 శాతానికి పెంపు!

ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. డబ్బు విత్‌డ్రా లిమిట్ 90 శాతానికి పెంపు!

ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పీఎఫ్ డబ్బు కోసం ఎదురుచూసే ఉద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్. రిటైర్మెంట్ ముందే తమ ప్రావిడెంట్ ఫండ్ పొదుపును మరింత సులభంగా, వేగంగా వాడుకునేలా ఈపీఎఫ్ఓ విత్‌డ్రా రూల్స్‌లో కీలక మార్పులు చేసింది. ఇకపై కష్టకాలంలో సొంత పీఎఫ్ నిధిపై మరింత ఎక్కువ హక్కు, వేగవంతమైన ఊరట లభించనున్నాయి.

కొత్త నిబంధనల ప్రకారం 55 ఏళ్ల లోపు వయసున్న పీఎఫ్ ఖాతాదారులు ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌లో ఏకంగా 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. గతంలో ఈ పరిమితి 75 శాతంగా ఉండేది. నిరుద్యోగ ఉపసంహరణల విషయంలోనూ భారీ మార్పు చేశారు. గతంలో 12 నెలల వెయిటింగ్ పీరియెడ్ ఉండగా.. ఇప్పుడు కేవలం 2 నెలలు పూర్తయిన తర్వాత సొమ్మును తీసుకునే వీలు కల్పించారు. ఆర్థిక ఇబ్బందులు, పెద్ద ఖర్చుల సమయంలో ఇది ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.

అయితే రిటైర్మెంట్ కోసం దాచుకున్న సొమ్ము పూర్తిగా కరిగిపోకుండా తగిన రక్షణ ఏర్పాట్లను కూడా ఈ మార్పుల్లో నిలిపి ఉంచారు. ఉద్దేశం, అర్హత షరతులను బట్టి ఖాతాదారులు తమ పీఎఫ్ నిధిలో ఎక్కువ భాగాన్ని త్వరగా పొందవచ్చు.

వైద్య చికిత్స, విద్య, వివాహం, ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు, స్థల కొనుగోలు, ఇల్లు నిర్మించడం, హోమ్ లోన్ చెల్లింపు, ఇంటి మరమ్మతులు వంటి అవసరాలకు పాటు ప్రత్యేక పరిస్థితుల్లోనూ విత్‌డ్రా చేసుకోవచ్చు. 2026 ఈపీఎఫ్ పథకం ప్రకారం ఈ నిబంధనలను ముఖ్య అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే 3 ప్రధాన విభాగాలుగా డివైడ్ చేశారు. నిర్దేశిత షరతులు, విత్‌డ్రా సంఖ్య పరిమితులకు లోబడి అర్హత ఉన్న బ్యాలెన్స్ నుంచి పీఎఫ్ సొమ్మును విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఈపీఎఫ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే ప్రక్రియను కూడా మరింత సరళతరం చేశారు.