శనగపిండి లడ్డూలపై కొత్త నిబంధనలు: డిసెంబర్ ఒకటి నుంచి మారనున్న రుచి!

శనగపిండి లడ్డూలపై కొత్త నిబంధనలు: డిసెంబర్ ఒకటి నుంచి మారనున్న రుచి!

డిసెంబర్ 1, 2026 నుంచి భారతీయ ఇళ్లలో నిత్యం వాడే శనగపిండి(బేసన్)పై కఠిన ఫుడ్ సేఫ్టీ రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) ఇప్పటివరకు పప్పుధాన్యాలకు మాత్రమే ఉన్న సీసం(లెడ్), కాడ్మియం వంటి భారీ లోహాల గరిష్ట పరిమితులను ఇప్పుడు పప్పుల పిండికి కూడా విస్తరించింది. శనగలను మరపట్టి పిండి తయారు చేస్తారు కాబట్టి.. పప్పులకు వర్తించే కఠిన ప్రమాణాలే బేసన్‌కూ వర్తిస్తాయి. పండుగల స్వీట్లు, బేసన్ లడ్డూలు, పకోడీలు, హాట్స్ తయారీలో శనగపిండి కీలకం కాబట్టి ఈ మార్పు ప్రతి ఇంటికీ సంబంధించినదని గుర్తుంచుకోవాలి. 

సీసం, కాడ్మియం ఎందుకు ప్రమాదకరం?
కలుషిత నేల, నీరు, వ్యవసాయ పద్ధతుల ద్వారా సీసం, కాడ్మియం వంటి భారీ లోహాలు పంటల్లోకి చేరుతాయి. ఇవి శరీరంలో పేరుకుపోతే తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. సీసం పూర్తిగా సురక్షితం కాదు. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల నాడీ వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక కాడ్మియం మూత్రపిండాల్లో పేరుకుపోయి 10 నుంచి 35 ఏళ్ల వరకు శరీరంలోనే ఉండే ప్రమాదం ఉంది. ఆహారం ద్వారా ప్రజలకు కాడ్మియం చేరే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో వీటిని నియంత్రించడం అత్యవసరమని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ చెబుతోంది.

శనగపిండి అసలు సురక్షితమేనా? స్వీట్ లవర్స్‌పై ప్రభావం ఏంటి?
కొత్త రూల్స్ వల్ల మార్కెట్లో దొరుకుతున్న శనగపిండి తినడానికి ప్రమాదకరమైనదని అర్థం కాదు. ఇది కేవలం అనుమతించదగిన గరిష్ట పరిమితిని నిర్దేశిస్తుంది. భారతీయ స్వీట్ లవర్స్, కుటుంబాలు బేసన్ లడ్డూలు.. శనగపిండితో తయారు చేసిన ఇతర వంటకాలను యథాతథంగా ఆస్వాదించవచ్చు. డిసెంబర్ 1 తర్వాత ప్యాకెట్ల రూపురేఖల్లో పెద్ద మార్పులు కనిపించకపోయినా.. ఉత్పత్తిదారులు విక్రయించే ముందే కఠిన ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ జాజికాయ, జాపత్రికి సాఫ్రోల్ పరిమితులు, ఫిష్ ఆయిల్స్‌కు ఆర్సెనిక్ పరిమితులు, సీఫుడ్‌కు యాంటీబయోటిక్ అవశేషాల పరిమితులను కూడా మార్చింది.

క్వాలిటీని ఎలా పరీక్షించాలి? 
శనగపిండిలో సీసం, కాడ్మియం ఉన్నాయా లేదా అనేది రంగు, వాసన, రుచి లేదా స్పర్శ ద్వారా తెలుసుకోలేం. ల్యాబ్‌లో శాంపిల్స్ యాసిడ్ డైజెషన్ చేసి, సున్నితమైన పరికరాలతో మిల్లీగ్రాములు ప్రతి కిలోగ్రాము (mg/kg)లో లెక్కిస్తారు. అయితే ప్యాకెట్లపై తయారీదారు వివరాలు, ధర, గడువు తేదీ ఉంటాయి కానీ.. నిర్దిష్ట బ్యాచ్ ల్యాబ్ నివేదిక సాధారణంగా ఉండదు. 2025-26లో 2లక్షల 23వేల 808 ఫుడ్ శాంపిల్స్ పరీక్షించగా 40వేల 023 టెస్టుల్లో ఫెయిల్ అయినట్లు లోక్‌సభలో వెల్లడించినా.. అందులో శనగపిండి శాంపిల్స్ వివరాలు స్పష్టంగా లేవు. చిన్న మిల్లులకు ల్యాబ్ పరీక్షలు ఖర్చుతో కూడుకున్నవి కాగా.. తనిఖీలు, పారదర్శకత పెరిగితేనే వినియోగదారుల ఆరోగ్యానికి పూర్తి భరోసా లభిస్తుంది.