న్యూఢిల్లీ: పెరుగుతున్న ఆహార ధరలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో ఆర్‌బీఐ 2027 జూన్ నాటికి రెపో రేటును (కీలక వడ్డీ రేటును) మరో 75 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఆర్థిక సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక అంచనా వేసింది. డిసెంబర్‌లో 25 బేసిస్ పాయింట్లు, 2027 మొదటి ఆరు నెలల్లో మరో 50 బేసిస్ పాయింట్ల పెంపుతో రెపో రేటు 5.50శాతం నుంచి 6.25 శాతానికి చేరవచ్చని పేర్కొంది.
ఇండియాలో అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.1 శాతానికి చేరడంతో ఆర్బీఐ మానిటరీ పాలసీని కఠినం చేసే అవకాశం ఉంది. వడ్డీ రేట్ల పెంపు ప్రభావంతో రియల్ జీడీపీ వృద్ధి రేటు 2026లో అంచనా వేసిన 7.9శాతం నుంచి 2027లో 7.2 శాతానికి స్వల్పంగా తగ్గవచ్చని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. అయినప్పటికీ, దేశీయ డిమాండ్, పెట్టుబడుల మద్దతుతో భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని పేర్కొంది.
రూపాయి విలువ ఏడాదిలో డాలర్‌తో పోలిస్తే రూ. 96 స్థాయికి చేరవచ్చని, భారత స్టాక్ మార్కెట్లను 'ఓవర్ వెయిట్'గా అప్‌గ్రేడ్ చేస్తూ 2027 చివరి నాటికి నిఫ్టీ 28,500 మార్కును తాకవచ్చని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది.
