- మొదటి ఆర్నెళ్లలో 16.9శాతం పెరుగుదల
- మొత్తం బిజినెస్ రూ.300 లక్షల కోట్లు
- కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో మెరుగైన ఫలితాలు సాధించాయి. అన్ని పీఎస్‌బీల మొత్తం నికర లాభం 16.9 శాతం పెరిగి రూ.1.10 లక్షల కోట్లకు చేరింది. మొత్తం బిజినెస్ తొలిసారిగా రూ.300 లక్షల కోట్లు దాటిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య పీఎస్‌బీల మొత్తం వ్యాపారం 15.5 శాతం పెరిగి రూ.301.6 లక్షల కోట్లకు చేరింది. డిపాజిట్లు 13.1 శాతం పెరిగి రూ.165.2 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అడ్వాన్సులు 18.8 శాతం పెరిగి రూ.136.4 లక్షల కోట్లకు చేరాయి.
ఆపరేటింగ్ ప్రాఫిట్ 13.9 శాతం పెరిగి రూ.1.81 లక్షల కోట్లు నమోదైంది. అసెట్లపై రాబడి 3 బేసిస్ పాయింట్లు పెరిగి 1.11 శాతానికి చేరింది. ఇది వరుసగా ఐదో ఏడాది కూడా లాభదాయకత మెరుగుపడింది. రిటైల్ అడ్వాన్సులు 17 శాతం, వ్యవసాయ లోన్లు 19.5 శాతం, ఎంఎస్ఎంఈ రంగానికి లోన్లు 20.4 శాతం పెరిగాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తగ్గిన మొండిబాకీలు
అసెట్ క్వాలిటీ కూడా మెరుగుపడింది. జీఎన్‌పీఏ నిష్పత్తి 1.69 శాతానికి తగ్గింది. ఇది ఇప్పటివరకు నమోదైన అతి తక్కువ స్థాయి. నెట్ ఎన్పీఏ నిష్పత్తి 0.33 శాతానికి పడింది. స్లిప్పేజీలు 0.62 శాతంగా నమోదయ్యాయి. రికవరీలు, అప్‌గ్రేడేషన్లు 21.1 శాతం పెరిగాయి. అన్ని పీఎస్‌బీల ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో 90 శాతం దాటింది. దీంతో రిజర్వులు బలోపేతమయ్యాయి. క్యాపిటల్ అడెక్వసీ రేషియో సెప్టెంబర్ 30, 2026 నాటికి 93 బేసిస్ పాయింట్లు పెరిగి 16.89 శాతానికి చేరింది. ఇది రెగ్యులేటరీ అవసరం కంటే చాలా ఎక్కువ.
