హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్‌కు చెందిన ఇన్‌ఫ్రా కంపెనీ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ విలువ సుమారు రూ. లక్ష కోట్లకు చేరిందని అంచనా. గ్లోబల్ పెట్టుబడి సంస్థలైన డీకే, హెచ్‌హెచ్, వర్డే పార్ట్‌నర్స్ సంస్థలు ఈ వాల్యుయేషన్ వద్ద స్ట్రక్చర్డ్ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ పద్ధతిలో ఈ కంపెనీకి ఫండ్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ఇది అప్పుకు, ఈక్విటీ వాటాకు మధ్యస్థంగా ఉండే ఒక ప్రత్యేకమైన పెట్టుబడి విధానం.
ఈ పద్ధతిలో పెట్టుబడిదారులు కంపెనీలో వాటా తీసుకుంటారు, కానీ వారికి ప్రతి ఏటా ఒక నిర్దిష్టమైన రాబడి వచ్చేలా ఒప్పందం ఉంటుంది. ఒకవేళ కంపెనీ ఆ రాబడిని ఇవ్వలేకపోతే, ఆ పెట్టుబడిదారులకు కంపెనీ నిర్ణయాల్లో లేదా ఆస్తులపై ప్రత్యేక హక్కులు లభిస్తాయి. మరోవైపు మేఘా నిర్మించిన రహదారి ప్రాజెక్టుల ద్వారా భవిష్యత్తులో వచ్చే టోల్ ఆదాయాన్ని లేదా వాటి యాజమాన్య హక్కులను ఈ ఇన్వెస్టర్లకు బదిలీ చేయడం ద్వారా మేఘా నిధులను సమీకరించుకుంది. ఈ ఒప్పందం ద్వారా సుమారు 700 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 6,650 కోట్ల) నిధుల సేకరణకు మార్గం సుగమమైంది.
20కి పైగా దేశాల్లో విస్తరణ
గత మూడు దశాబ్దాలుగా విస్తరిస్తున్న ఎంఈఐఎల్ ప్రస్తుతం 20కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశంలో జోజిలా సొరంగ మార్గం, ముంబయి కోస్టల్ రోడ్, పోలవరం, కాళేశ్వరం, పాలమూరు-–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలతో పాటు 1,975 కి.మీ. రహదారి ప్రాజెక్టులను చేపడుతోంది. ఇంధన రంగంలో 9,110 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్, 3,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులతో పాటు కర్ణాటకలోని కైగా వద్ద 700 మెగావాట్ల సామర్థ్యం గల రెండు అణు రియాక్టర్ల నిర్మాణంలో భాగస్వామ్యమైంది.
