కొత్త జిల్లాల్లో టీజీఎల్ఐ ఆఫీసులు పెట్టాలె..సీఎస్ కు ఎస్టీయూ వినతి

కొత్త జిల్లాల్లో టీజీఎల్ఐ ఆఫీసులు పెట్టాలె..సీఎస్ కు ఎస్టీయూ వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా (టీజీఎల్ఐ) కార్యాలయాలను ఏర్పాటు చేసి, ఉద్యోగులకు స్థానికంగానే సేవలు అందించాలని ఎస్టీయూటీఎస్ డిమాండ్ చేసింది. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు  సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. సదానందం గౌడ్, జుట్టు గజేందర్ వినతిపత్రం అందించారు. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేసి, ఉద్యోగుల లోకల్ కేడర్ విభజన ప్రక్రియను కూడా పూర్తి చేసిందని వారు గుర్తు చేశారు.

అయినప్పటికీ టీజీఎల్ఐ ఆఫీసులు ఇప్పటికీ పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనే కొనసాగుతుండటంతో కొత్త జిల్లాలకు చెందిన టీచర్లు, ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పాలసీల నమోదు, మెచ్యూరిటీ పాలసీల దరఖాస్తులు, లోన్లు, మిస్సింగ్ క్రెడిట్లు తదితర ఆఫీసు పనుల కోసం దూర ప్రాంతాల్లోని ఉమ్మడి జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు.