సీపీఐ సీనియర్ లీడర్ ఉజ్జిని రత్నాకర్‌రావు ‘డిండి ఎత్తిపోతలను పూర్తిచేయాలి’ అనే శీర్షికతో 30 అక్టోబర్ 2026న వెలుగు దినపత్రికలో ఒక వ్యాసం రాశారు. అది న్యాయభావనతో కానీ, సత్యం ఆధారంగా కానీ రాసిన వ్యాసం కాదు. ఆ వ్యాసం వివక్షతో, అర్ధసత్యాలతో, అసత్యాలతో లేని ఆమోదం ఉన్నది అని అనేక వక్రీకరణలతో నిండి ఉంది. వెలుగు పాఠకులు నిజాలు తెలుసుకోవడం అవసరం. విజ్ఞులైన తెలంగాణ ప్రజలు ప్రత్యేకించి కృష్ణాబేసిన్ ప్రజలు, అందునా తెలంగాణ ఉద్యమకారులు, కవులు, రచయితలు, కళాకారులు కఠినమైన నిజాలు తెలుసుకోకుండా తెలంగాణ పునర్నిర్మాణ కృషిలో విజ్ఞతతో పాల్గొనజాలరు. తెలంగాణలో జలవనరుల కల్పనలో తీవ్ర వివక్షకు, అన్యాయానికి గురైన మహబూబ్‌నగర్ బిడ్డలుగా మా గొంతు వినిపించవలసిన అవసరంవల్ల రత్నాకర్‌రావు వ్యాసంలోని అసత్యాలు పాఠకులకు వివరించాల్సిన అగత్యం ఏర్పడింది.
దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల ఫ్లోరైడ్ బాధిత ప్రజలకు సాగు, తాగునీటి సౌకర్యాల కల్పనకు 2004లో అప్పటి ప్రభుత్వం డిండి ఎత్తిపోతల సర్వేకు ఆదేశించిందని, అందుకు 2007లో నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని రాశారు. అలాగే ఎస్‌ఎల్‌బీసీ నుంచి చేపట్టే ఈ పథకం ఖర్చుతో కూడిందని, ఎప్పటికి పూర్తవుతుందో తెలియదని అందుకోసమే దీనిని పాలమూరు– రంగారెడ్డి పథకానికి జతచేశారని అన్నారు. అంతేకాకుండా మహబూబ్‌నగర్ ప్రజలు తమ రెండు టీఎంసీల నీరు తమకే కావాలని పోరాడుతున్నారు కనుక.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకం కోసం అదనంగా అర టీఎంసీ నీరు తీసుకోవాలని ఆదేశించారు కనుక ఇరువైపులా సంతోషం కలిగిందని ఇక డిండి ఎత్తిపోతలను సత్వరం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వీరు సమస్య మూలాన్ని కానీ, సత్యాన్ని కానీ పరిశీలనకు తీసుకోలేదు. అసలు వాస్తవం వేరే ఉంది. చిన్న పిల్లలకు కథ చెప్పేవాళ్లు తమ చేతిలో కీలుగుర్రం లేకుండానే కీలుగుర్రం కథ చెబుతుంటారు. సరిగ్గా అట్లాగే తగిన పరిశీలన లేని ఇంజినీర్లు ఈ కీలుగుర్రాన్ని సొమ్ము చేసుకునేదానికి వాడుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ రైతాంగం అమాయకులని, దిక్కులేనివాళ్లనుకుని డిండి ఎత్తిపోతల అనే కథను సాగదీస్తున్నారు. దీనిని ముగించాలి.
సాగునీటి సమరం
అసలు డిండి ఎత్తిపోతల అనేది లేదు. దానికి కాలం చెల్లిపోయింది. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలు అక్కడి ప్రజలు, రైతులు నిజం. అక్కడ ఫ్లోరైడ్ బాధ నిజం. ఈ నిజం పునాది మీదనే నల్గొండ జిల్లాలో ఒక మహత్తరమైన, ఆదర్శమైన, సాగునీటి సమరం సాగింది. ప్రభుత్వాలు వణికిపోయాయి. యావత్తు తెలంగాణ ఆ పోరాటంలో పదం, కదం కలిపి కదిలింది. ఆ కారణంగానే పుట్టంగడి లిఫ్ట్ పనులు మొదలయ్యాయి. ఇంకోవైపున అటు రాయలసీమలోనూ సాగునీటి పోరు సాగింది. కేవలం హైడల్ ప్రాజెక్టుగా శ్రీశైలం ప్రాజెక్టు నీటినంతటినీ దిగువకు తరలించడాన్ని ఆనాటి ఉద్యమాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్టు కూడా బహుళార్థ సాధక ప్రాజెక్టు కాకతప్పలేదు. ఇటు ఎస్‌ఎల్‌బీసీ అటు ఎస్‌ఆర్‌బీసీ కాలువలు తవ్వక తప్పలేదు. అటు పోతిరెడ్డిపాడు గేట్లు రావడం, అవి కృష్ణానదినే అటు మలిపే స్థాయికి పెరుగుతూపోవడం ప్రపంచానికి తెలిసిన కథే. ఇటు ఎస్ఎల్‌బీసీ కాలువలు తవ్వారు. టన్నెల్ వదిలేశారు. తిరిగి అనేక పోరాటాలు, ఇంతలో పుట్టంగండి లిఫ్టు పూర్తయింది. ఆ నీటిని ఎస్‌ఎల్‌బీసీ కాలువ కింది రైతులు, వారి నాయకులు బలం కారణంగా ఎస్‌ఎల్‌బీసీ కాలువలోకి మలిపారు. దేవరకొండ, మునుగోడులను వదిలేశారు. ఇవి మళ్లీ మొదటి సమస్యగా మారాయి.
భూపోరాటాలు చేసినవారికి మహబూబ్‌నగర్ సమస్య ఎందుకు అర్థం కాలేదు?
ఎస్‌ఎల్‌బీసీ కాలువకు నీటి సమస్య పుట్టంగండి లిఫ్టులో ఉంది. కనుక ఇక ఎస్‌ఎల్‌బీసీ నీటిని దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు తరలించడానికి డిండి ఎత్తిపోతల అనే ప్రతిపాదనను కాయితాలమీదికి తెచ్చి ప్రజానిధులు దుర్వినియోగం చేశారు. ఎస్‌ఎల్‌బీసి ఎప్పటికి పూర్తవుతుందో అనే వంక ముందుకు తెచ్చి కాయితాల మీది డిండికి మరొక ప్రత్యామ్నాయంగా పాలమూరు– రంగారెడ్డి పథకానికి తగిలించారు. ఇది దుర్మార్గం. ఇది కేవలం నీటి సమస్యకాదు. అంతకన్నా భూమి సమస్య. అనేక భూపోరాటాలు చేసిన ఉజ్జినిగారికి ఉమ్మడి మహబూబ్‌నగర్ భూమి సమస్య ఎందుకు అర్థం కాలేదు. పుట్టంగండి లిఫ్టును ప్రస్తుతం ఎఎంఆర్ లిఫ్టు అంటున్నారు. ఎస్‌ఎల్‌బీసీ, ఎంఎంఆర్‌లలో ఏదో ఒకనీరు ఎస్‌ఎల్‌బీసీ కాలువకు చాలు. ఒకదాని నీరు అదనంగా ఉంటుంది. ఆ నీరు దేవరకొండ, మునుగోడులకు తరలించవచ్చు. అలాకాకుండా మహబూబ్‌నగర్ భూములు ముంచడం ఎందుకు. మహబూబ్‌నగర్ ప్రజలం, పార్టీలు, ప్రజాప్రతినిధులు ఈ నీరు తరలించడాన్ని, ఇక్కడి భూములు ముంచ డాన్ని తీవ్రంగా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం.
మా వ్యతిరేకతను మా ఆమోదంగా రాయడం
ఎంత బరితెగింపు. ఇది తగదు. అన్ని పార్టీలు వ్యతిరేకించాయి.మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాలని, పూర్తిచేయాలని రైతులు, సంఘాలే కాదు. రైట్‌వింగ్ పార్టీలు, లెఫ్ట్‌పార్టీలు కూడా పోరాడాయి. అన్ని పార్టీలు డిండి లిఫ్టు పేరుతో నీరు తరలించడాన్ని భూములు ముంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అన్ని పార్టీలు వీధులలోకి, పోరాటాలలోకి వచ్చాయి. ఎందుకంటే ఇప్పడు డిండి పేరుతో ఆక్రమిస్తున్న భూములు కల్వకుర్తి ఎత్తిపోతల కింది ఆయకట్టు భూములు. మహబూబ్‌నగర్ జిల్లా పట్ల ఇంత వివక్ష ఎందుకో మాకు అర్థం కావడం లేదు. ఇది తెలంగాణ పట్ల ఆంధ్ర వివక్ష కన్నా అన్యాయంగా ఉంది. చిన్న ఉదాహరణ చూడండి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 1984లో ప్రతిపాదనకు వచ్చి ఇరవై ఏండ్ల తరువాత 2005లో పనులు మొదలై 2012లో రెండు స్టేజ్‌ల పనులు జరిగి 2017 నుంచి మూడోస్టేజి లిఫ్టు నీరు రాకడ మొదలై ఈనాటికీ
పూర్తికాలేదు. 40 టీఎంసీల పథకంలో నాలుగు టీఎంసీల నీరు నిలిపే రిజర్వాయర్లు కూడా లేవు. కానీ డిండి పేరుతో 2016లో పనులు ప్రారంభించిన ఈ అక్రమ పథకంలో 27 టీఎంసీల నీటి నిల్వ రిజర్వాయర్లు ప్రతిపాదించి 23 టీఎంసీల రిజర్వాయర్లు పూర్తి చేశారు. ఈ వివక్ష మహబూబ్‌నగర్ ప్రజలను ఆగ్రహానికి గురిచేయదా. ఒకవేళ వీరి ప్రజాప్రతినిధులు మౌనంగా ఉంటే ప్రజల ఆగ్రహానికి గురికారా?.
బాధిత ప్రజల పోరాటం
కఠినమైన నిజం ఏమిటంటే.. కృష్ణాబేసిన్‌లో ఒక జిల్లాగా నల్గొండ జిల్లా తన హక్కుకు మించిన నీటిని అనుభవిస్తున్నది. ఎంతటి మొనగాడు లెక్కలతో ముందుకువచ్చినా పబ్లిగ్గా చర్చించవచ్చు. ప్రభుత్వాలది ఎంత బేమానీతనం అంటే 2017లో దెబ్బతిన్న కేఎల్‌ఐ పంపులను పదేండ్లయినా బాగు చేయించలేదు. కల్వకుర్తి పేరుతో చేపట్టిన ఆ లిఫ్టు నీరు కల్వకుర్తి భూములను తడపటం లేదు. మధ్యలో డిండి ప్రాజెక్టులోకి పోతున్నాయి. ఇది కల్వకర్తి నియోజకవర్గ రైతుల మీద ప్రభుత్వాలు అమలుచేస్తున్న హింస.
రత్నాకర్‌రావుగారు పర్యటనకు వస్తే మేం వెంట ఉండి చూపిస్తాం. లేక వారి పార్టీ ప్రతినిధులైనా చూపుతారు. రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే ప్రభుత్వాలు పీడితుల కోసం, సమానతా సాధన కోసం పనిచేయాలి. ప్రభుత్వాలు దారి తప్పినప్పుడు ప్రతిపక్ష పార్టీలు న్యాయంవైపు నుంచి ప్రభుత్వాలతో పోరాడాలి. కానీ ఒక వామపక్ష పార్టీ సీనియర్ నాయకుడు అన్యాయ సమర్థనకు తెగబడితే ఇదే పార్టీ విధానమా అని బాధిత ప్రజలు పార్టీతో కూడా పోరాడతారు. లెక్కలేదు, న్యాయం లేదు, నీరు తీసుకుంటాం అంటే పుట్టంగండి పక్కన మరి రెండు మోటార్లు పెట్టండి. లేక బస్వాపూర్ నుంచి గోదావరి నీరు తీసుకోండి. పీఆర్‌ఎల్‌ఐ నుంచి నీరు తీసుకుంటే భూములు పోతాయి. పేద రైతులు శాశ్వత, దీర్ఘకాలిక పోరాటాలతో ప్రతిఘటిస్తారు.
- ఎం.రాఘవాచారి,
కన్వీనర్, పాలమూరు అధ్యయన వేదిక
