- నిబంధనలు అతిక్రమించిన బిల్డర్లకు భారీ జరిమానా విధింపు
- చెక్కులు బౌన్స్ చేసినా, రిజిస్ట్రేషన్ ఆపినా శిక్ష తప్పదంటూ స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ రంగంలో నిబంధనలను ఉల్లంఘించిన పలు నిర్మాణ సంస్థలపై రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రేరా) కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్లాట్ల రిజిస్ట్రేషన్లో జాప్యం, నగదు వాపసులో నిర్లక్ష్యం, కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, రెరా నమోదు లేకుండానే విక్రయాలు చేపట్టడం వంటి 17 కీలక ఫిర్యాదులపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తూ బుధవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. చెక్కులు బౌన్స్ చేసినా, రిజిస్ట్రేషన్ ఆపినా శిక్ష తప్పదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
వడ్డీతో సహా వాపసు చేయాల్సిందే
జస్విత ఎస్టేట్స్ (శాండ్ స్టోన్ ఇన్ఫ్రా)కు చెందిన శంకర్పల్లి ప్రాజెక్టులో 2019లో డబ్బులు వసూలు చేసి ప్లాట్ నం. 86 రిజిస్ట్రేషన్ చేయకపోవడమే కాకుండా, ఇచ్చిన రీఫండ్ చెక్కులు బౌన్స్ కావడంపై రెరా ఆగ్రహం వ్యక్తం చేసింది. కొనుగోలుదారుకు రూ.47 లక్షలను 10.85% వార్షిక వడ్డీతో 60 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. గూగీ శాటిలైట్ టౌన్షిప్ (గూగీ ప్రాపర్టీస్)కు చెందిన నోముల ప్రాజెక్టులో మిగిలిన రూ.18.80 లక్షలను 60 రోజుల్లోగా కొనుగోలుదారులకు చెల్లించాలని ఆదేశించింది.
10.85% వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది. ఎస్వీ ఎలక్ట్రానిక్ సిటీ-3 (బీవీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్)కి చెందిన ప్లాట్ నం. 91 తనఖాలో ఉండటం, రిజిస్ట్రేషన్ చేయకపోవడం, రీఫండ్ చెక్కులు బౌన్స్ కావడంతో రూ.6.10 లక్షలను 10.85% వడ్డీతో 60 రోజుల్లోగా తిరిగి ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది.
అసలు మొత్తం వాపసు చేయాలి
సిగ్నేచర్ టవర్స్ (ఆశ్రితాస్ గ్రూప్)కి చెందిన తూంకుంట ప్రాజెక్టులో కొనుగోలుదారు వ్యక్తిగత కారణాలతో గడువుకు ముందే బుకింగ్ రద్దు చేసుకున్నందున, వడ్డీ లేకుండా రూ.9 లక్షలను 60 రోజుల్లోగా చెల్లించాలని రెరా ఆదేశించింది. ఫ్లాట్ మరొకరికి అమ్మాకే డబ్బు ఇస్తామన్న బిల్డర్ వాదనను రెరా తోసిపుచ్చింది. కపిల్ బిజినెస్ పార్క్ (కౌసల్య ఇన్ఫ్రా, బీవీఎం ఎనర్జీ)కు చెందిన వాణిజ్య యూనిట్ కొనుగోలుదారు కేటాయింపు నుంచి వైదొలగడంతో రూ.24,64,259 ను వడ్డీ లేకుండా 60 రోజుల్లోగా ఇవ్వాలని ఆదేశించింది.
భారీ జరిమానాలివే..
గత ఆదేశాలను అమలు చేయని ఆర్డీబీ హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై 2025 జూన్ 2 నుంచి రోజుకు రూ.1,000 చొప్పున జరిమానా విధించగా, 2026 నవంబర్ 17 నాటికి అది రూ.5.34 లక్షలకు చేరింది. 15 రోజుల్లోగా ప్రాజెక్టు నమోదు ప్రారంభించాలని, గతంలోని రూ.6 లక్షల బకాయి జరిమానా వసూలు చేయాలని రెరా ఆదేశించింది. నమోదు లేకుండా విక్రయాలు కొనసాగిస్తే 'డిఫాల్టర్'గా ప్రకటిస్తామని రెరా హెచ్చరించింది.
