- వాటర్ సమస్య పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచన
- సింగూరు, మంజీరాలో నీళ్లు తగ్గాయని విద్యాశాఖకు జలమండలి ఎండీ లేఖ
- 2027 ఆగస్టు వరకు కనీసం 20% నీటి వాడకం తగ్గించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ఎల్ నినో ప్రభావంతో వచ్చే వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున విద్యార్థులకు నీటి పొదుపుపై అవగాహన కల్పించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలకు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ తదితర అన్ని మేనేజ్మెంట్ల విద్యాసంస్థల్లో ఉదయం మార్నింగ్ అసెంబ్లీ టైమ్ లో పిల్లలకు అర్థమయ్యేలా సరళమైన భాషలో నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
ఎల్ నినో నేపథ్యంలో హైదరాబాద్ జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి.. విద్యాశాఖకు లేఖ రాశారు. తక్కువ వర్షపాతంతో సింగూరు, మంజీరా వంటి నీటి వనరుల్లో నీటిమట్టాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఎండాకాలంలో తాగునీటి లభ్యతపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని జలమండలి ఎండీ తన లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్లో తాగునీటిని సమర్థవంతంగా అందించేందుకు అడ్వాన్స్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో నీళ్లను వృథా చేయొద్దనే అలవాటు నేర్పిస్తే ఆ సందేశం వారి కుటుంబాలకు, సమాజంలో అందరికీ చేరుతుందని వివరించారు. ఈ లేఖతో పాటు ఆయన పంపిన నమూనా పోస్టర్, నీటి సంరక్షణ ప్రతిజ్ఞను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అన్ని జిల్లాలకు పంపించారు.
రోజూ నిమిషం సందేశం.. సర్టిఫికెట్లు
రోజూ ఉదయం స్కూల్ అసెంబ్లీలో ఎల్ నినో పరిస్థితులు, వానలపై దాని ప్రభావం, వేసవిలో తాగునీటిని ఆదా చేయాల్సిన అవసరంపై కనీసం ఒక నిమిషం పాటు ప్రత్యేక సందేశం ఇవ్వాలని ఉత్తర్వుల్లో సూచించారు. ‘నీరు మన జీవనాధారం. ప్రతి నీటి బొట్టును విలువైనదిగా భావిస్తాను. నీటిని వృథా చేయను, ఇతరులను వృథా చేయనివ్వను’ అంటూ విద్యార్థులతో నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేయించాలన్నారు. నీటి వృథాను గుర్తించి అరికట్టేలా పిల్లలను ప్రోత్సహించాలని, ఇందులో పాల్గొన్న విద్యార్థులకు స్కూల్ స్థాయిలోనే లేదా హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అభినందన, ప్రతిజ్ఞ సర్టిఫికెట్లు అందించాలని పేర్కొన్నారు.
వచ్చే పది నెలల పాటు అంటే 2027 ఆగస్టు వరకు ప్రతి వ్యక్తి, కుటుంబం, సంస్థ మంచి అలవాట్లు పాటిస్తూ కనీసం 20 శాతం నీటి వాడకాన్ని తగ్గించుకునేలా చూడాలని జలమండలి కోరింది. ఇందులో భాగంగా వాడిన వెంటనే ట్యాపులను పూర్తిగా కట్టేయాలని, ఎక్కడైనా లీకేజీలు కనిపిస్తే టీచర్లకు లేదా అధికారులకు చెప్పాలని విద్యార్థులకు వివరించనున్నారు. పళ్లు తోముకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, చేతులు కడుక్కునేటప్పుడు అవసరమైనన్ని నీళ్లే వాడాలని, వాన నీటిని ఒడిసిపట్టే విధానం, ఇంకుడు గుంతల ప్రాధాన్యతను పిల్లలకు తెలియజేయాలని సూచించారు.
