డోంగల్.. దొంగల్ ! పంచాయతీ సెక్రటరీల డోంగల్ ఈ–పంచాయతీ ఆపరేటర్ల దగ్గరే..

డోంగల్.. దొంగల్ ! పంచాయతీ సెక్రటరీల డోంగల్ ఈ–పంచాయతీ ఆపరేటర్ల దగ్గరే..
  • ఓటీపీ ఆప్షన్ లేకపోవడంతో ఇదే అదనుగా దుర్వినియోగం
  • మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 29 డెత్ సర్టిఫికెట్లు జారీ
  • నలుగురు సెక్రటరీలపై వేటు, ఆపరేటర్​పై క్రిమినల్ కేసు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని బుధాకుర్దు, పెర్కపల్లి పంచాయతీ సెక్రటరీల పేరిట ఈ–పంచాయతీ ఆపరేటర్ దాదాపు 29 డెత్ సర్టిఫికెట్లను స్థానికేతరులకు జారీ చేశారు. సెక్రటరీల డోంగల్ ఈ–పంచాయతీ ఆపరేటర్ దగ్గర ఉండడం, ఆఫీసర్ల పర్యవేక్షణ లేకపోవడంతో దుర్వినియోగం చేశారు. మిగతా అన్ని పనులకు డోంగల్​ను వినియోగించినప్పుడు సంబంధిత సెక్రటరీలకు ఓటీపీ వస్తుంది.

కానీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల విషయంలో పాస్​వార్డు ఆప్షన్ లేకపోవడంతో ఆపరేటర్ పని ఈజీ అయ్యింది. ఈ సంఘటన ఈ–పంచాయతీ వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. ఇక్కడే కాదు, రాష్ర్టవ్యాప్తంగా పంచాయతీ సెక్రటరీల డోంగల్స్ ఆపరేటర్ల దగ్గర ఉండడంతో దుర్వినియోగవుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

ఆపరేటర్ల చేతిలో కీ..!
పంచాయతీల్లో వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వం ఈ–పంచాయతీ ఆపరేటర్లను ఔట్​సోర్సింగ్ పద్ధతిలో నియమించింది. వీరు ఎంపీడీవో ఆఫీసులు కేంద్రంగా ఎంపీవోల పర్యవేక్షణలో పనిచేస్తుంటారు. ఈ–పంచాయతీలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఆపరేటర్ల ద్వారానే కొనసాగుతాయి. పంచాయతీ సెక్రటరీలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆపరేటర్లు వారి డోంగల్​ను ఉపయోగించి పని పూర్తి చేస్తుంటారు. సెక్రటరీల ద్వారా జరిగే వివిధ కార్యకలాపాల కోసం ఆపరేటర్లు డోంగల్​ను వినియోగించినప్పుడు దానికి లింక్ చేసిన మొబైల్ నంబర్​కు ఓటీపీ వస్తుంది.

అది ఎంటర్ చేస్తేనే లాగిన్ కు అవకాశం ఉంటుంది. కానీ, అత్యంత కీలకమైన బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి పాస్వర్డ్ ఆప్షన్ లేదు. దీంతో సెక్రటరీల ప్రమేయం లేకుండానే ఆపరేటర్లు సదరు సర్టిఫికెట్లు జారీ చేయడానికి చాన్స్ ఇచ్చినట్లయింది. ఈ–పంచాయతీ ఆపరేటర్లను ఔట్​సోర్సింగ్ పద్ధతిలో నియమించడంతో వారికి ఎలాంటి బాధ్యత లేకుండా పోతోంది. ఏదైనా తప్పు జరిగినప్పుడు ఉన్నతాధికారులు సెక్రటరీలను బాధ్యులను చేసి యాక్షన్ తీసుకుంటున్నారని వాపోతున్నారు. 

బెల్లంపల్లిలో ఏం జరిగిందంటే..
బెల్లంపల్లి మండలం పెర్కపల్లి, బుధాకుర్దు పంచాయతీ సెక్రటరీల పేరిట ఇటీవల దాదాపు 29 డెత్ సర్టిఫికెట్లు స్థానికేతరులకు జారీ అయ్యాయి. బుధాకుర్దు సెక్రటరీ ఆగస్టు 2 నుంచి లీవ్​లో ఉండగా, పెర్కపల్లి సెక్రటరీ మరో పంచాయతీకి ట్రాన్స్​ఫర్ కావడంతో ఇతర సెక్రటరీలకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇదే అదనుగా ఈ–పంచాయతీ ఆపరేటర్ చిందం శ్రీనివాస్ బుధాకుర్దులో 16, పెర్కపల్లిలో 13 సర్టిఫికెట్లు లీవ్​లో ఉన్న, ట్రాన్స్​ఫర్ అయిన సెక్రటరీల సంతకాలతో ఇష్యూ చేశారు. కొంతమంది లీడర్లు ఆపరేటర్లను ప్రలోభపెట్టి ఈ సర్టిఫికెట్లు తీసుకున్నట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు నలుగురు సెక్రటరీలపై సస్పెన్షన్ వేటు వేశారు. దీనంతటికి మూలకారణమైన ఆపరేటర్​పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్రిమినల్ కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో సెక్రటరీల ప్రత్యక్ష పాత్ర లేకపోయినప్పటికీ చర్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందంటున్నారు. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో డోంగల్ వినియోగించినప్పుడు పాస్​వర్డు ఆప్షన్ లేకపోవడం కారణమని పేర్కొంటున్నారు. ఈ వ్యవహారం బయటపడడంతో ఆపరేటర్ల దగ్గర ఉన్న డోంగల్​ను సెక్రటరీలకు అప్పగించాలని బుధవారం సాయంత్రం హడావుడిగా ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది.