- ఇప్పటికే పెట్రోల్ బంకులు, సోలార్ వాటర్ ఫ్లాంట్లు, మహిళా శక్తి క్యాంటీన్లు ఇచ్చాం
- మహిళల ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు
- తప్పుడు ప్రచారం చేస్తన్రు: మంత్రి ధనసరి సీతక్క
వరంగల్, వెలుగు: రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ఫంక్షన్ హాల్స్ కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని పంచాయతీరాజ్‍శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. బుధవారం వరంగల్ జిల్లా గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్వద్ద పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‍రెడ్డితో కలిసి రూ.40.95 కోట్లతో చేపట్టనున్న హ్యామ్ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం సీఎం రేవంత్‍రెడ్డి లక్ష్యమన్నారు. అందులో భాగంగానే ఇందరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులతో పాటు పలు పథకాలను మహిళల పేర్లపై అందిస్తున్నట్లు చెప్పారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం పెట్రోల్ బంకులు, సోలార్ వాటర్ ప్లాంట్లు, 300 ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మేడారం జాతరలో మహిళా సంఘాలకు రూ.3 కోట్ల లోన్లు ఇస్తే వారు రూ.9 కోట్లు ఆదాయం సంపాదించారన్నారు. గడిచిన మూడేండ్లలో రూ.75 వేల కోట్లు మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ‘మహిళలకు బస్సులిచ్చినా బీఆర్‍సోళ్లకు బాధే.. చీరలిచ్చినా.. లోన్లు ఇచ్చినా బాధే” అని ఎద్దేవా చేశారు. మహిళలకు ప్రభుత్వం చేస్తున్న సాయంపై ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 90 లక్షల నుంచి కోటిమంది ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ రిజర్వేషన్ల వల్లే తాను ఎంపీగా, సీతక్క మంత్రిస్థాయి వరకు ఎదిగినట్లు చెప్పారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగ మార్పుపై కుట్ర చేస్తారని ఆరోపించారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‍రెడ్డి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ మహిళల అభివృద్ధి లక్ష్యంగా ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అడవికి పోయిన, తుపాకీ పట్టిన, బయటకు వచ్చిన.. ఐదేండ్లలో న్యాయవాదిగా మారిన : మంత్రి సీతక్క
మహిళలు ఆర్థికంగా ఎదగడంతోపాటు ఆత్మవిశ్వాసం, విద్య, విజ్ఞానాన్ని పెంపొందించుకుంటే జీవితంలో ఎంతటి ఉన్నత స్థాయికైనా చేరుకోవచ్చని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ''నేను చిన్నప్పుడు అడవికి పోయినా. తుపాకీ పట్టినా. పోరాటం చేసినా. మళ్లీ బయటకు వచ్చినా. చదువు మొదలుపెట్టినా. వరంగల్ కోర్టులో చేతులు కట్టుకుని నిలబడ్డా. ఆపై ఐదేండ్లకు అదే కోర్టుకు పేదోళ్ల తరఫున ఆర్గ్యుమెంట్ చేసేందుకు న్యాయవాదిగా జడ్జిముందుకు వెళ్లినా. నేను ఇప్పటికి ఇంకా చదువుకుంటున్నా” అని చెప్పారు.
రాష్ట్ర కెబినెట్లో కీలకమైన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పదవి నాకు ఇచ్చేప్పుడు కూడా ''ఆదివాసీ మహిళ, అడవి బిడ్డ, కోయజాతి సమ్మక్కసారక్క బిడ్డ.. ఈమె చేస్తాదా'' అని కొందరు అనుకున్నారు. కానీ నేను ఛాలెంజ్‍గా తీసుకుని ముందుకు సాగుతున్నానన్నారు. రాష్ట్రంలోని మహిళా సంఘాల్లో 70 లక్షల మంది ఉంటే అందులో 12 లక్షల మందికి చదువు లేదన్నారు. వారికి 'అమ్మకు అక్షరమాల' కార్యక్రమం ద్వారా విద్య నేర్పిస్తున్నట్లు వెల్లడించారు.
