ఇందిరమ్మ కమిటీలకు జిల్లా చైర్మన్లుగా డీసీసీ అధ్యక్షులు:  సీఎం, పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం

 ఇందిరమ్మ కమిటీలకు జిల్లా చైర్మన్లుగా డీసీసీ అధ్యక్షులు:  సీఎం, పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం
  • ఆర్థిక శాఖకు చేరిన ఫైలు.. ఆమోదం పొందగానే ప్రోటోకాల్ అమలు
  • జిల్లాల్లో ఇటు పార్టీ, అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షులకు పెరగనున్న గౌరవం

హైదరాబాద్, వెలుగు: జిల్లా కాంగ్రెస్ కమిటీ ( డీసీసీ ) అధ్యక్షులకు ఇటు పార్టీ పరంగా అటు ప్రభుత్వ పరంగా తగిన ప్రాధాన్యం ఇచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వపరంగా ఇందిరమ్మ జిల్లా కమిటీలను  నియమించి వీటికి డీసీసీ అధ్యక్షులను చైర్మన్లుగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫైల్ తాజాగా ఆర్థిక శాఖకు చేరింది. అక్కడ ఆమోదం పొందిన వెంటనే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు ఆయా జిల్లాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ అమలు కానుంది.

దీంతో వారికి పార్టీలో కూడా గౌరవం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  వాస్తవానికి కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడు లేని రీతిలో ఈసారి డీసీసీ అధ్యక్షులను నేరుగా పార్టీ హైకమాండ్​ నియమించింది. వారు  నేరుగా ఏఐసీసీకి  జవాబుదారీగా ఉంటున్నారు. ఇదే విషయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ఇక్కడ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీ వేదికలపై డీసీసీ అధ్యక్షుల ప్రాధాన్యతను ప్రస్తావించారు.

 ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదని ఫిర్యాదులు.. 
వాస్తవానికి జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులకు ఆ స్థాయిలో గౌరవం, గుర్తింపు దక్కడం లేదు. వారి మాటను, వారి ఆదేశాలను  సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు  ఏఐసీసీ వరకు వెళ్లాయి.  కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జిగా మొన్నటి వరకు పనిచేసిన మీనాక్షి నటరాజన్ కు పలువురు డీసీసీ అధ్యక్షులు ఈ అంశంపైనే తమ ఆవేదన వెలిబుచ్చారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ కు సైతం ఇవే ఫిర్యాదులు వెళ్లాయి.

జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాలను నియమించే  విషయంలో తాము  పార్టీ ఎమ్మెల్యేలను సంప్రదించినా,  స్పందించడం లేదని, జిల్లా మంత్రి, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రులు తమను పట్టించుకోవడం లేదని డీసీసీ అధ్యక్షులు తమ ఆవేదనను హైకమాండ్​దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాల్లో ప్రభుత్వ పరంగా జరిగే పలు కార్యక్రమాల్లో తమకు అస్సలు గుర్తింపు లేకుండా పోవడం వల్ల తమకు పార్టీలో గౌరవం దక్కడం లేదని  వాపోయారు. 

ఆర్థిక శాఖకు చేరిన ఫైలు.. 
 ఈ క్రమంలోనే డీసీసీ అధ్యక్షులకు ఆయా జిల్లాలో ఇటు పార్టీ పరంగా అటు  ప్రభుత్వ పరంగా తగిన గుర్తింపు, ప్రాధాన్యత దక్కాలనే ఉద్దేశ్యంతోనే ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు, వాటి నిర్మాణానికి సంబంధించిన  జిల్లా కమిటీలకు డీసీసీ అధ్యక్షులను ఛైర్మన్లుగా నియమించి, వారికి ప్రోటో కాల్ ఇవ్వాలని హైకమాండ్ నుంచి​ ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఇందిరమ్మ కమిటీల నిర్ణయం తీసుకున్నట్లు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతున్నది.  ఇందుకు సంబంధించిన ఫైల్ ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి వద్దకు చేరింది.  ప్రస్తుతం ఆర్థిక శాఖ దగ్గర పరిశీలనలో ఉంది. అక్కడ ఆమోద ముద్ర పడగానే డీసీసీ అధ్యక్షులకు ఆయా జిల్లాల్లో అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ గుర్తింపు దక్కనుంది.