పోలీసుల పైకి దూసుకెళ్లిన ఇసుక వాహనం: రాజన్న సిరిసిల్లలో ఘటన

పోలీసుల పైకి దూసుకెళ్లిన ఇసుక వాహనం: రాజన్న సిరిసిల్లలో ఘటన

ఎల్లారెడ్డిపేట, వెలుగు: అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి ఇసుక పికప్ వాహనాన్ని డ్రైవర్ పోనివ్వడంతో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్సై బాల్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో మంగళవారం రాత్రి బ్లూకోల్ట్స్​ హోంగార్డు మహిపాల్, కానిస్టేబుల్ రమేశ్​ విధులు నిర్వహిస్తున్నారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో వాహనాలను తనిఖీ చేస్తుండగా, ఇసుక పికప్ వాహనాన్ని డ్రైవర్ ఆపకుండా పోలీసులపైకి పోనిచ్చాడు. దీంతో మహిపాల్ పక్కకు తప్పించుకోగా, కానిస్టేబుల్ రమేశ్​కాలు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే క్షతగాత్రుడిని ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో పికప్ వాహనం నడుపుతున్న ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందిన మైనర్, ఓనర్​ గొల్లపల్లికి చెందిన వేముల విజయ్, మరో మైనర్ ​ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని ఎస్సై తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.