తరుణ్ బాస్కర్ దాస్యం తెరకెక్కించిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో నటించారు. సృజన్ ఎరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించారు. గురువారం సినిమా రిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్యఅతిథలుగా హాజరైన నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు ఈ చిత్రం ఘన విజయం సాధించాలంటూ దిల్ రాజు బెస్ట్ విషెస్ చెప్పారు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘ఫైనల్ కాపీ చూశాక మాటలు రాలేదు. బయటకు వెళ్లాక నన్ను వెంటాడింది. నా జీవితంలో ఇదొక బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్. చాలా సర్ ప్రైజ్‌లు ఉంటాయి. అందరూ గర్వపడేలా ఈ చిత్రం ఉంటుంది. నా కెరీర్‌లో ఇదొక మైల్ స్టోన్ సినిమాగా నిలుస్తుంది’ అని చెప్పాడు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ‘నా కథను నేనే చెప్పాలని ‘ఈ నగరానికి ఏమైంది’ తీశా. కానీ రీ రిలీజ్‌లో వచ్చిన రెస్పాన్స్ చూశాక, బాధ్యతతో ఒళ్లు దగ్గర పెట్టుకుని ‘ఈఎన్‌ఈ రిపీట్’ తీశాను.
చిన్న పిల్లలు, పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ కలిసి చూసేలా తీశా. ఒక్క ఫ్రైడే కోసం ఈ సినిమా తీయలేదు. భవిష్యత్ తరాలు కూడా చూసి ఎంజాయ్ చేసేలా చిత్రాన్ని తీశాను’ అని అన్నారు. నటీనటులు, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్, శివాత్మిక రాజశేఖర్, అనీషా ఆంబ్రోస్, నిర్మాతలు సృజన్ ఎరబోలు, సందీప్ నాగిరెడ్డి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
